గవర్నర్‌ను కలిసిన విద్యాశాఖ మంత్రి
భువనేశ్వర్: రాష్ట్ర ఉన్నత విద్య, క్రీడలు, యువజన సేవలు, ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్ శుక్రవారం లోక్ భవన్‌లో గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రస్తుతస్థితి, సంబంధిత కార్యక్రమాలపై మంత్రి చర్చించారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలలో వైస్ చాన్స్‌లర్ నియామక ప్రక్రియ గురించి మంత్రి గవర్నర్‌కు వివరించారు. పారదర్శకత, యోగ్యత, నిర్ణీత సమయంలో నియామక ప్రక్రియను పూర్తి చేయడంపై ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలలో ఆరోగ్యవంతమైన విద్యా వాతావరణ, పాలనను బలోపేతం, విద్యా ప్రమాణాల మెరుగుదల, సంస్థాగత పనితీరు దక్షత పెంపు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో బోధన, అభ్యాస నాణ్యత సంస్కరణల గురించి మంత్రి గవర్నర్‌కు వివరించారు. దీనితో పాటు క్రీడలలో విద్యార్థుల భాగస్వామ్యం ప్రోత్సాహంతో రాష్ట్రంలో క్రీడల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి తీసుకున్న చర్యలను చర్చించారు.


