భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తాం
● బిజు స్వాభిమాన్ మంచ్
వ్యవస్థాపకుడు నెక్కంటి
రాయగడ: సుధీర్ఘ 50 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేడీ పార్టీకి ఎన్నో సేవలందించిన రాజ్యసభ మాజీ ఎంపీ నెక్కంటి భాస్కరావు కొద్దిరోజుల క్రితం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బిజూ స్వాభిమాన్ మంచ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బిజు స్వాభిమాన్ మంచ్ రాజకీయ పార్టీ కాదని, కేవలం ప్రజలకు సేవలందించే సంస్థగా మాత్రమే పనిచేస్తుందని అప్పట్లో ప్రకటించారు. అయితే తాజాగా జిల్లాలో రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంతో ఆయన బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. తనను నమ్ముకుని ఉన్న ప్రజల కోసం తాను ఎప్పుడూ ముందే ఉంటానన్నారు. ప్రజల సమస్యల కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 31వ తేదీన స్థానిక తేజస్వీ మైదానంలో బంధుమిలన్ పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందరి సూచనలు, సలహాల మేరకు తాను భవిష్యత్ ప్రణాళికను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తానని ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకుని ప్రజల్లోకి దూసుకెళ్తానని చెప్పారు. త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో తాము మద్దతు తెలిపే పార్టీని గెలిపించేందుకు సాయశక్తులా కృషి చేస్తానని వివరించారు. అయితే ఏ పార్టీలొ చేరుతారన్న విలేకరుల ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుందని బదులిచ్చారు. సమావేశంలో ఆయనతో పాటు మాజీ మంత్రి లాల్ బిహారి హిమిరిక ఉన్నారు.


