శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారుల రక్షణకు పోక్సో చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని ఫస్ట్ అడిషనల్ జడ్జి కె.ఎం.జామరుద్ బేగం, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ తలే లక్ష్మణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ కమిటీ, జువైనల్ జస్టిస్ బోర్డు ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టడంలో పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరించారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చట్టం ప్రకారం పిల్లలుగా పరిగణించబడతారని, బాధితులకు న్యాయ సహాయం అందించడం, వారి గుర్తింపును రహస్యంగా ఉంచడం, సురక్షితమైన వాతావరణాన్ని అందించడం చట్టం ముఖ్య ఉద్దేశమని వివరించారు. తీవ్రమైన లైంగిక వేధింపుల కేసుల్లో మరణశిక్ష సైతం విధించే అవకాశం ఉందని చెప్పారు. పిల్లలకు మంచి చెడులను వివరించడం, వారికి అవగాహన కల్పించడం సమాజం బాధ్యతని పేర్కొన్నారు.


