సాలూరు: మండలంలోని నెలిపర్తి పంచాయతీ వంగర గుడ్డివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు సాలూరు పట్టణంలో లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వంగరగుడ్డివలస గ్రామానికి చెందిన భార్యాభర్తలు మజ్జి రాము(51), గురిబారి(47)లు సాలూరు పట్టణానికి వచ్చి సొంత పనులు ముగించుకుని ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. ఈ క్రమంలో పట్టణంలో బైపాస్ రోడ్డు వై జంక్షన్ వద్ద వారి బైక్‌ను ఒడిశా నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.కాగా ఆ భార్యాభర్తలు విజయవాడలో వలస పనులకు వెళ్లి ఇటీవలే తమ స్వగ్రామానికి వచ్చినట్లు తెలియవస్తోంది.
లారీ ఢీకొని భార్యాభర్తల మృతి