ఆదిత్యునికి ప్రత్యేక పూజలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారికి ఆదివారం ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. స్థానికులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లలో భాగంగా ఆలయ మండపాల్లో పరిసరాల్లో పెయింటింగ్ ఇతర త్రా క్యూలైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్న క్రమంలో భక్తులకు దర్శనాల మార్గంలో ఇబ్బందులు లేకుండా ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ చర్యలు చేపట్టారు. అంతరాలయంలో సర్వదర్శనాలు సక్రమంగా అయ్యేలా ప్రధానార్చకులు ఇప్పిలి శంశరశర్మ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సతీమణి ఆదిత్యున్ని దర్శించుకున్నారు.
హోంగార్డుపై దాడి
సోంపేట: సోంపేటలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న బెహరా ఖగపతిపై దాడి చేసిన బి.సతీష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి సోంపేట పట్టణంలో మద్యం తాగి గొడవ చేస్తున్న సతీష్‌ను హోంగార్డు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తున్న క్రమంలో సతీష్ దాడి చేశాడు. ఈ మేరకు హోంగార్డు ఖగపతి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి.లోవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టును ఢీకొని వ్యాన్ బోల్తా
మెళియాపుట్టి : బాణాపురం వద్ద శనివారం అర్ధరాత్రి ఓ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పలాస వైపు నుంచి మెళియాపుట్టి వైపు వస్తున్న ఓ వ్యాన్ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాణాపురం రహదారి వద్ద చెట్టును ఢీకొట్టింది. గాల్లో ఎగిరి రహదారిపై పడింది. ఉదయం వెళ్లి స్థానికులు చూసేసరికి రెండు చక్రాలు ఊడిపోయి వ్యాన్ కనిపించింది. ఒడిశా రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఈ వ్యాన్‌లో ఓ కంపెనీ సామగ్రి రవాణా చేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు వ్యక్తులు గాయపడటంతో అంబులెన్స్‌లో తీసుకెళ్లారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తమ ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై రమేష్‌బాబు తెలిపారు.
డీసీసీ అధ్యక్షుడిగా అన్నాజీరావు
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సనపల అన్నాజీరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అన్నాజీరావు కట్యాచార్యులపేట పీఏసీఎస్ అధ్యక్షుడిగా, కొర్లకోట ఎంపీటీసీ సభ్యుడిగా, డీసీసీ జిల్లా కార్యదర్శిగా, ప్రచార కార్యదర్శిగా, ఆమదాలవలస మండల, బ్లాకు అధ్యక్షుడిగా, పంచాయతీ అభియాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. గతంలో ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన బొడ్డేపల్లి సత్యవతి డీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టగా ఇపుడు అన్నాజీరావు నియమితులవ్వడం విశేషం. ఈయన నియామకం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిట
శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో కిటకిటలాడింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి అరసవల్లి సూర్యనారాయణస్వామివారిని దర్శించుకునేందుకు, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేందుకు భారీ ఎత్తున రావడంతో రద్దీగా కనిపించింది. ఉచిత ప్రయాణం కావడంతో మహిళా ప్రయాణికులు అధిక సంఖ్యలో రావడంతో బస్సుల్లో సీట్ల కోసం ఎగబడ్డారు.
అరకు అందాలు అద్భుతం
అరకులోయ టౌన్: అరకులోయ అందాలు అద్భుతమని ఏపీ మాజీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగుడలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. కటికి జలపాతం, సుంకరమెట్టలోని ఉడెన్ బ్రిడ్జి, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడలోని చాపరాయి జలవిహారిని తిలకించారు. మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద గిరిజనుల వస్త్రధారణలో థింసా కళాకారులతో నృత్యం చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ సెలయేర్లు, కొండలు, లోయలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు చాలా ఆకట్టుకున్నాయని చెప్పారు.
ఆదిత్యునికి ప్రత్యేక పూజలు
ఆదిత్యునికి ప్రత్యేక పూజలు
ఆదిత్యునికి ప్రత్యేక పూజలు


