కార్యకర్తల సమీకరణలో బీఎస్పీ సన్నాహాలు
రాయగడ: బహుజన్ సమాజ్ పార్టీ జిల్లాలో తన ఉనికిని చాటుకునేందుకు రంగం సిద్ధం చేస్తుంది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు సన్నహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ కార్యకర్తలను సమీకరించేందుకు మల్లగుల్లాలు పడుతుంది. ఇటీవల పార్టీలో చేరిన జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు గంగాధర్ పువ్వల, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సరోజ్ నాయక్, జిల్లా అధ్యక్షుడు జితు జకసిలు జిల్లాలోని వివిధ సమితుల్లో విస్తృతంగా పర్యటించి కార్యకర్తలతో సమావేశమమవుతున్నారు. బిసంకటక్‌లో పట్టున్న బీఎస్పీ మరింత బలం పుంజుకునేలా నాయకులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం బిసంకటక్‌లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో సరోజ్ నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలం పుంజుకుంటుందన్నారు. రానున్న పంచాయితీ ఎన్నికల్లో అంతా కలసి కట్టుగా పనిచేయడం ద్వారా అత్యధిక స్థానాలు సంపాదించుకోవచ్చని అన్నారు. అందువల్ల ఇప్పటి నుంచే కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. జిల్లా అధ్యక్షుడు జితు జకసిక మాట్లాడుతూ.. బిసంకటక్ సమితి పరిధిలోని నియమగిరి పర్వత ప్రాంతాలో అత్యధిక మంది నివసిస్తున్న డొంగిరియా గ్రామాలో పార్టీకి మంచి ఆదరణ ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లోని సమస్యలను అడిగి తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాల్సి ఉందన్నారు.
పార్టీలో చేరికలు
ఈ సందర్భంగా బీజేడీ, కాంగ్రేస్ పార్టీలకు చెందిన యువకులు నాయకుల సమక్షంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. సమితిలో కీలకపాత్ర పోషించే యువకులు పార్టీ పటిష్టతకు తమవంతు కృషి చేస్తామన్నారు. చంచాడగుడ పంచాయతీకి చెందిన నాయబ్ సర్పంచ్, సమితి సభ్యులు బీఎస్పీలో చేరిన వారిలో ఉన్నారు.


