70 వినతుల స్వీకరణ
రాయగడ:జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఆధ్వర్యంలో స్థానిక డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 70 వినతులను అధికారులు స్వీకరించారు. వీటిలో 52 వ్యక్తిగత సమస్యలు ఉండగా.. మరో 18 గ్రామసమస్యలుగా గుర్తించారు. ఎనిమిది మందికి చికిత్స కోసం ఆర్థిక సహాయం కోసం అభ్యర్థించగా.. ఇందులో ఐదుగురికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 1.20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే మరో ముగ్గురికి జిల్లా రెడ్ క్రాస్ నిధుల నుంచి 25 వేల రూపాయల చొప్పున సాయం అందజేశారు. వినతుల స్వీకరణలో భాగంగా వచ్చిన గ్రామ సమస్యలను సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి సత్వర చర్యలు తీసుకుని అవి పరిష్కారమయ్యే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆలస్యంగా వచ్చినందుకు..
రాయగడలోని డీఆర్‌డీఏ సమావేశం హాల్‌లో సోమవారం జరిగిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి ఆలస్యంగా హాజరైన కొంతమంది అధికారులపై జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి మండి పడ్డారు. వారిని వినతుల స్వీకరణ కార్యక్రమానికి లోపలకు వచ్చేందుకు అనుమతివ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ జెన్న, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, జిల్లా సంక్షేబశాఖ అధికారి ఆసీమా రావ్, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా సామాజిక సురక్షా అధికారి, రాయగడ బీడీవో, అటవీ శాఖ ఏసీఎఫ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆలస్యంగా రావడంతో వారిని లోనికి అనుమతించలేదు. ఉదయం పది గంటలకు వినతుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవ్వగా.. సుమారు రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన అధికారులు కలెక్టర్ పిలుపు కోసం ఎదురు చూస్తు ఆరుబయటే ఉండిపొవాల్సి వచ్చింది. ఇటువంటి తరహా చర్యలు చేపట్టిన కలెక్టర్‌ను పలువురు ప్రశంసించారు. వినతుల స్వీకరణ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వాతి ఎస్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ కుమార్ ఖెముండో పాల్గొన్నారు.


