నగరంలో ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటుకు యోచన
భువనేశ్వర్: వాయు నాణ్యత పరిరక్షణ కోసం నగర పాలక సంస్థ బీఎంసీ రంగంలోకి దిగింది. ఈ మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డుతో సంప్రదింపులు ప్రారంభించింది. నగరంలోని కీలక ప్రదేశాలలో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటు చేయాలనే యోచనతో ఈ సంప్రదింపులు ప్రారంభించినట్లు నగర మేయర్ సులోచనా దాస్ తెలిపారు. తొలి దశలో జయదేవ్ విహార్, ఏజీ ఛక్ వద్ద వాటిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఈ విషయంలో కాలుష్య నియంత్రణ బోర్డుతో చర్చలు జరిగాయి. ఈ దిశలో వాయు కాలుష్య నియంత్రణ చర్యలో భాగంగా ఊడ్చే చోట నీరు చల్లుతున్నారు. వాయు నాణ్యత పరిరక్షణ బీఎంసీకి మాత్రమే పరిమితం కాదు. ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. కొన్ని ఇళ్లలో 4 నుంచి 5 వాహనాలను ఉపయోగించడం సబబు కాదని మేయరు హితవు పలికారు.
వైద్యుల ఆందోళన
మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితిలో పరిధిలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 5 నుంచి 15 వరకు రోగులకు సేవలందించడం నిలిపివేయనున్నామని వైద్య బృందం తెలిపింది. కోరుకొండ, బలిమెల ఆరోగ్యకేంద్రం మటాపాకా, తుమసాపల్లి, ఎంవీ 19, ఎంవీ 47 వంటి ప్రభుత్వాస్పత్రుల్లోనూ ఓపీ సేవలు నిలిపివేయనున్నారు. వైద్యుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తే తిరిగి వైద్య సేవలు అందిస్తామని వైద్యులు తెలిపారు .
నదిలో మునిగి యువకుడు మృతి
రాయగడ: నదిలో మునిగి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన జిల్లాలోని చంద్రపూర్ సమితి బిజాపూర్ గ్రామ పంచాయతీలొని గొడింగి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకోగా.. సూరజ్ గంట (22) మృతి చెందాడు. స్నేహితులతో కలిసి స్నానం కోసం సూరజ్ హరభంగి నదికి వెళ్లారు. స్నానాలు చేస్తుండగా సూరజ్ ప్రమాదవశాత్తు నీటమునిగి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు నదిలో గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యువతి అనుమానాస్పద మృతి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి మఠపడ గ్రామ పంచాయతీ నిసానపకన గ్రామంలో భగవాన్ ఖిలో కుమార్తె కమళి ఖిలో(23) అనుమానాస్థితిలో మరణించింది. ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి భగవాన్ బొయిపరిగుడ పోలీసు స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కమళి ఆ గ్రామంలో తమ బంధువు ఘన పంగి ఇంటిలో ఉంటోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు దుఖియ పొరజ అనే వ్యక్తి భగవాన్ ఇంటికి వచ్చి నీ కుమార్తె కమళి ఘన పంగి ఇంటి సమీపంలో ఉన్న ఖెందు చెట్టు కొమ్మకు ఉరిపోసుకుందని తెలిపాడు. వెంటనే భగవాన్ ఖిలో కొంత మంది గ్రామస్తులతో సంఘటనా ప్రాంతానికి వెళ్లారు. వారు వెళ్లే సరికి కమళీ మృత దేహం చెట్టు కిందన పడి ఉంది. మృత దేహం సమీపాన ఓణీ కూడా పడి ఉంది. వారు వెళ్లే సరికి ఓణీ కిందపడి ఉండటం, ఆమె మెడకు లేకపోవటంతో ఆమెది ఆత్మహత్య కాదని అనుమానించారు. ఘన పంగి కుమారుడు బాబులు పంగి, కమళీ ఖిళో ప్రేమిస్తున్నాడని అందుచేత ఆ ఇంటివారే ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానంతో బొయిపరిగుడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి పోలీసులు సైంటిఫిక్ టీమ్‌తో చేరి దర్యాప్తు ప్రారంభించారు.
నగరంలో ఎయిర్ ప్యూరిఫయర్లు ఏర్పాటుకు యోచన


