ప్రతిభకు వైకల్యం అడ్డుకాదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంధులు, పాక్షిక దృష్టి లోపం ఉన్నవారి జీవితాల్లో బ్రెయిలీ లిపి సరికొత్త వెలుగులు నింపిందని, ఈ గొప్ప ఆవిష్కరణ ద్వారా వారు విద్యావంతులుగా మారి సమాజంలో సగౌరవంగా జీవించగలుగుతున్నారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. కలెక్టరేట్ ఆవరణలోని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో ఆదివారం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దృష్టి లోపం ఉన్నవారు ఆత్మన్యూనతా భావాన్ని వీడి లూయిస్ బ్రెయిలీని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. దృష్టి లోపం ఉన్నవారికి న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే న్యాయ సేవా సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లు, ఇతర రాయితీలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శైలజ, వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.


