సంగీతంతో మానసిక ప్రశాంతత
● డాక్టర్ రాజేష్ పాఢి
రాయగడ: సంగీతంతో మానసిక ప్రశాంతత లభిస్తోందని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ పాఢి అభిప్రాయపడ్డారు. స్థానిక రాజ్‌భవన్‌లో స్వరనీరాజనం సాంస్కృతిక సంస్థ మూడో వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. సంగీతానికి భాష, ప్రాంతీయ భేదాలు లేవన్నారు. నిత్యం ఒత్తిడితో ఉన్న వారు కాస్తంత సమయం సంగీతంపై వెచ్చిస్తే వారికి ఎంతో మానసిక ప్రశాంత లభిస్తుందని అన్నారు. భాషాభేదాలు లేని సంగీతానికి అందరూ వశమవుతారని అన్నారు. అయితే ప్రస్తుతం సంగీత, సాహిత్య రంగాలు కనుమరుగువుతన్న సమయంలో స్వరనీరాజనం వంటి సాహితీ, సాంస్కృతిక సంస్థ కళాకారులు, కళాభిమానులకు ఊపిరి పోసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. మన సంప్రదాయాలు, భాష, కళలను పరిరక్షించడం మనందరి కర్తవ్యమని హితవు పలికారు. భావితరాలకు బాటలు వేసే ఇటువంటి సంస్థలు మరిన్ని ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కళాభిమానులు, సంగీత ప్రియులు ఉన్నంత వరకు ఇవి జీవిస్తుంటాయని పేర్కొన్నారు. రాజ్‌భవన్ చైర్మన్ జీడి చౌదరి గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. స్థానికంగా ఎన్నో తెలుగు సంస్థలు ఉన్నాయని అన్నారు. భాషాభేదాలు లేకుండా స్థానికంగా ఉండే సాహితీ, సాంస్కృతిక సంస్థలు ఒకతాటిపై నడిస్తే కళలు, కళాకారులకు ఎంతో ప్రోత్సాహం లభిస్తోందన్నారు. స్వరనీరాజనం సాహితీ, సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు లక్ష్మీసాయి మాట్లాడుతూ.. సంస్థ ఆవర్భవించి మూడేళ్లు అయిందన్నారు. సంస్థ తరఫున ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూప్‌లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలకు చెందిన ఎంతోమంది కవులు, గాయకులు, కళాభిమానులు సభ్యులుగా ఉన్నారని వివరించారు. నెలలో రెండుసార్లు వాట్సప్ గ్రూప్‌లో సమావేశాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా ఏడాదిలో వార్షికోత్సవం జరుపుకుంటున్నామన్నారు. అందరి సలహాలు, సూచనలు, సహకారంతో మూడేళ్లు గడిచిన సంస్థ భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు కళాభిమానులు, గాయకులను సంస్థ ఘనంగా సన్మానించింది. అనంతరం సంస్థకు చెందిన గాయనీ, గాయకులు పాటలు పాడి ప్రేక్షకులను అలరింపజేశారు. సంస్థ కార్యదర్శి వీఆర్ పట్నాయక్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
డాక్టర్ రాజేష్ పాఢిని సన్మానిస్తున్న సంస్థ సభ్యులు
గీతాలాపన చేస్తున్న లక్ష్మీసాయి, తదితరులు
సంగీతంతో మానసిక ప్రశాంతత


