బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామంలో గిట్టుపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో శనివారం వేకువజామున ఒక దుకాణంలో చోరీ జరిగింది. దుకాణంలో కొంత నగదుతో పాటు విలువైన కిరాణా సామగ్రి అపహరించుకుపోయారు. కనిమెరక గ్రామానికి చెందిన జి.శ్రీనివాస్ గుప్తా బోడసింగిపేటలో కిరాణా దుకాణాన్ని కొన్నాళ్లుగా నడుపుతున్నాడు. రోజూలాగే శుక్రవారం రాత్రి దుకాణం మూసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం వచ్చి చూడగా దుకాణం షట్టర్లు పగులకొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ యు.మహేష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారారాలను సేకరించారు. దుకాణంలో ఉంచిన రూ.12వేల నగదుతో పాటు రూ.13 వేల విలువ చేసే కిరాణా వస్తువులు అపహరించుకుపోయినట్టు బాధితుడు గుప్తా తెలిపాడు.
బెల్లం ఊట ధ్వంసం
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని కుశిమిగూడ పరిధిలో మూడు వేల లీటర్ల పులిసిన బెల్లం ఊటలు శనివారం ధ్వంసం చేసినట్టు ఎస్‌ఐ వై.అమ్మన్నరావు శనివారం తెలిపారు. సారా వంటకాలు చేస్తున్నారనే సమాచారం అందడంతో దాడులు జరిపినట్టు తెలిపారు. భూమిలో డ్రమ్ములతో పాతి ఉంచిన బెల్లం ఊటలు వెలికి తీసి పారబోసి, డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నామన్నారు.
బాసంగిలో గజరాజుల గుంపు
జియ్యమ్మవలస: మండలంలోని బాసంగి పంట పొలాల్లో గజరాజుల గుంపు శనివారం సాయంత్రం కనిపించాయి. ఉదయం వెంకటరాజపురం, బాసంగి, గదబవలసలో వరి పంటలను ధ్వంసం చేసిన గజరాజులు సాయంత్రానికి బాసంగి పరిసర ప్రాంతాల్లోకి చేరాయి. రాత్రికి మళ్లీ వెంకటరాజపురం, గవరమ్మపేట గ్రామాల్లోకి చొచ్చుకు రావడంతో గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. రబీ వరి పంట ఉభాలు వేసి నెల రోజులు కావడంతో పంటలను ధ్వంసం చేస్తే పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
258 కేజీల గంజాయి స్వాధీనం
పాచిపెంట: మండలంలో రెండు కార్లలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు రూరల్ సీఐ రామకృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద పట్టుబడిన గంజాయిని చూపించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం మండలంలో కొటికిపెంట పంచాయతీ గోగాడవలస సమీపంలో హరిత రహదారిపై అనుమానాస్పదంగా రెండు కార్లు ఉన్నాయని మాతుమూరు ఇంచార్జ్ వీఆర్‌ఓ తమకు సమాచారం ఇచ్చారని తెలిపాడు. ఈ మేరకు పాచిపెంట ఎస్‌ఐ వెంకటసురేష్ సిబ్బందితో ఆ ప్రదేశానికి వెళ్లి కార్లలో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
రొయ్యల చెరువులో దిగి యువకుడి మృతి
గుమ్మలక్ష్మీపురం: రాజమండ్రి సమీపంలోని పాలకొల్లులో రొయ్యల చెరువులో పనికి వెళ్లిన గిరిజన యువకుడు మండంగి కిరణ్ (25) రొయ్యల చెరువులో దిగి శనివారం మృతి చెందినట్లు సమాచారం. ఈ మేరకు తల్లిదండ్రులు లక్కమ్మ, శంకరరావు ఇతర కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్మలక్ష్మీపురం మండలంలోని వనకాబడి పంచాయతీ వండిడి గ్రామానికి చెందిన కిరణ్ కుటుంబ పోషణ నిమిత్తం రొయ్యల చెరువులో పని చేసేందుకు రెండు నెలల క్రితం వె వెళ్లాడు. రొయ్యల చెరువులో కర్రలు పాతాలంటూ యజమాని చెప్పడంతో శనివారం చెరువులో దిగాడు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడంటూ.. పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంది రావాలంటూ పాలకొల్లు నుంచి తమకు ఫోన్ వచ్చిందని తెలిపారు.
నేడు అక్షరాస్యత అర్హత పరీక్ష
విజయనగరం అర్బన్: అక్షరాస్యత అర్హత కోసం చేపట్టిన ఉల్లాస్ కోర్సు పరీక్షను ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు వయోజన విద్య ఉప సంచాలకులు ఎ.సోమేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 27 మండలాల్లో 48,578 మంది అభ్యాసకులు ఈ పరీక్ష రాయనున్నారు. దీనికోసం 1,051 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇన్విజిలేటర్‌గా అంగన్‌వాడీ టీచర్లు వ్యవహరిస్తారు. వయోజన విద్య శాఖకు సంబంధించి రాష్ట్ర పరిశీలకులుగా ఎ.దొరబాబు జిల్లాలో హాజరుకానున్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, ఏపీఎం వెలుగు, సీడీపీఓ, ఐసీడీఎస్ అధికారులు, గ్రామస్థాయిలో సీసీ వెలుగు, ఐసీడీఎస్ సిబ్బంది పర్యవేక్షిస్తారు.
బోడసింగిపేటలో చోరీ
బోడసింగిపేటలో చోరీ