● బాకాలు ఊదుతూ నిరసన తెలిపిన నాయకులు
● హోరెత్తిన సభ
భువనేశ్వర్: రాష్ట్ర శాసన సభలో శుక్రవారం నాటి పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. కాంగ్రెస్ సభ్యులు తగ్గేదే లేదని తెగేసి స్పీకరుని చుట్టుముట్టారు. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలపై కాంగ్రెస్ వైఖరిలో ఏమాత్రం తగ్గేది లేదు. ఈ విచారకర పరిస్థితులపై ప్రభుత్వం సభా కమిటీ ఏర్పాటు చేయాల్సిందేనని తొడ గొడుతున్నారు. బడ్జెటు సమావేశాల ఆరంభం నుంచి కాంగ్రెస్ సభ్యులు ఇదే పట్టుతో ఏమాత్రం సడలకుండా నిలదీస్తున్నారు. సభలో ఉద్యమానికి సారథిగా పేరొందిన తారా ప్రసాద్ బాహిణీపతిని సభ నుంచి వారం రోజుల పాటు సస్పెన్షన్ ఉత్తర్వుల్ని స్పీకరు జారీ చేయడంతో పరిస్థితి మరింత బిగుసుకుంది. నిత్యం నిరసనలతో సభా ప్రాంగణం హోరెత్తి పోతోంది. నిరసనకారుల వ్యతిరేకంగా చర్యలు చేపట్టలేని దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వ దక్షత ఊగిసలాడుతోంది. రోజుకో అవతారంతో కాంగ్రెస్ సభ్యులు స్పీకరుని చుట్టుముట్టి సభలో గలాటా రేపుతున్నారు. నిస్సహాయ పరిస్థితుల్లో స్పీకరు సభని అంచెలంచెలుగా వాయిదా వేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
శుక్రవారం మరో విభిన్న రూపంలో కాంగ్రెస్ సభ్యులు సభలో ప్రత్యక్షం అయ్యారు. అంతా నల్లని దుస్తులు ధరించి తలకు నల్లని పాగా చుట్టి వింత రూపంలో తారస పడ్డారు. సభా కార్యక్రమాలు మొదలు కావడంతో తలో వాద్యంతో సభా ప్రాంగణాన్ని మనోరంజక వేదికగా మలిచారు. ఘంటానాదం, వేణు గానం, బాకా బజాయింపుతో సభ ప్రాంగణం హోరెత్తి పోయింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో సభా కార్యకలాపాల్ని స్పీకరు వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నిరసన కారణంగా శాసన సభలో ప్రశ్నోత్తరాలకు పూర్తిగా గండి పడింది. సభని ఉదయం 11.30 గంటల వరకు స్పీకరు సురమా పాఢి వాయిదా వేయడంతో ఈ విచారకర పరిస్థితి నిరవధికంగా కొనసాగుతుంది. వేణు గానం, బాకా బజాయింపు, ఘంటానాదం చేస్తు కాంగ్రెస్ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. మహిళలపై నేరాలను నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని చేసిన నినాదాలతో సభని మారు మోగించారు.
మరోవైపు సభలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాన విపక్షం బిజూ జనతాదళ్ (బీజేడీ) సభ్యులు కూడా సభ నుంచి వైదొలిగారు. బీజేడీ సభ్యులు సభలోని స్పీకరు పీఠం ముంగిటకు చేరి ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేస్తు స్పీకరుకు చేతులు ఊపుతూ తమ అసంతృప్తిని వ్యక్తం చేసి బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కలిగిన ప్రజా సమస్యలపై గళం కదిపేందుకు వీలు లేకుండా అధికార పక్షం అన్యాయానికి పాల్పడుతోందని ఆరోపించారు. చర్చలో పాల్గొనడానికి తమకు తగిన అవకాశం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు.
సభలో కాంగ్రెస్ దుమారం