జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితిలో గురువారం ఒక అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుంది. పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులపై ఎండిన చెట్టు కొమ్మ విరిగి పడి ఒక విద్యార్థి దుర్మరణం చెందగా మిగతా వారు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ–రాంచీ 326 జాతీయ రహదారిపై బైక్‌పై ముగ్గురు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా ఒక ఎండిన చెట్టు కొమ్మ వారి బైక్‌పై పడింది. ఘటనలో జయపురం సమితి డొంగిరిపంశి పంచాయతీ బరంగపుట్ గ్రామానికి చెందిన మహేంద్ర నాయిక్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. భరిణిపుట్ పంచాయతీ నువాగుడ గ్రామానికి చెందిన కమలలోచన హరిజన్, మలిగుడ గ్రామానికి చెందిన ధరమ మాలి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కొరాపుట్ సహిద్ లక్ష్మణ నాయక్ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. వీరు డిగ్రీ చదువుతున్నారు. మహేంద్ర మృతదేహానికి పోస్టు మార్టం జరిపి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
చెట్టు కొమ్మ పడి విద్యార్థి దుర్మరణం