పర్లాకిమిడి:
స్థానిక సొండివీధిలో మద్యం వ్యాపారులు తిరుపతి సాహుకార్, లోకేశ్వర్ సాహుకార్ నివాసాల్లో గురువారం ఐటీ దాడులు జరిగాయి. వేకువజాము నుంచే భువనేశ్వర్ నుంచి ఆదాయపు పన్ను, ఈడీ అధికారులు నేరుగా తెలుగు సొండివీధికి వెళ్లి వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు చేశారు. విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పర్లాకిమిడి మార్కెట్ జంక్షన్‌లో జానకీ ట్రేడర్స్ షాపులో ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపారు. మూడు కార్లలో అధికారులు వచ్చి దాడులు జరపడం పట్టణంలో సంచలనంగా మారింది. గురువారం ఉదయం నుంచి ఏకలంలో ఢెంకనాల్, అనుగుల్, భువనేశ్వర్, తాల్చేర్, పూరీ, కటక్, పర్లాకిమిడిలలో సోదాలు జరిగినట్టు ఐటీ అధికారులు తెలిపారు. తొలుత ఢెంకనాల్‌లో తముసింగ పి.ఎస్.పరిధిలో శక్తి మాల్టేర్ అండ్ లిమోనైడ్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్, బౌధ్‌లో డిస్టిల్లరీ కంపెనీలు, ఎం.డీ. విక్రం సాహు కంపెనీలపై దాడులు జరిగాయి. కాగా, ఈ దాడులపై శక్తి మాల్టేర్ అండ్ లిమోనైడ్ ప్రైవేటు కంపెనీ ఎండీ విక్రం సాహు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ఎటువంటి స్పిరిట్ తయారుచేయడం లేదని, ఇతర కంపెనీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా, జార్ఖండ్‌లో ఓ మద్యం వ్యాపారి ఇంట్లో సోదాలు జరపగా సుమారు రూ.350 కోట్ల విలువైన డబ్బు, బంగారం పట్టుబడటంతో వారితో సంబంధం ఉందంటూ విక్రం సాహు ఇళ్లల్లో ఐ.టీ.శాఖ దాడులు జరిపారు. విక్రం సాహుతో సంబంధం ఉన్న పర్లాకిమిడిలో ప్రముఖ మద్యం వ్యాపారులు నివాసాల్లో కూడా సోదాలు జరపడం విశేషం.
పర్లాకిమిడి మార్కెట్ జంక్షన్ వద్ద జానకీ ట్రేడర్స్ వద్ద ఐటీ శాఖ దాడులు
మద్యం వ్యాపారుల నివాసాల్లో ఐటీ దాడులు
మద్యం వ్యాపారుల నివాసాల్లో ఐటీ దాడులు
మద్యం వ్యాపారుల నివాసాల్లో ఐటీ దాడులు