జయపురం: కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ (కేసీసీ బ్యాంక్) లాభాల బాటలో పరుగులు తీస్తుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.12 కోట్ల 51 లక్షలు లాభం ఆర్జించింది. ఈ విషయాన్ని స్థానిక కె.సి.సి బ్యాంక్ కేంద్రం కార్యాలయ సభా గృహంలో గురువారం జరిగిన 74వ వార్శిక సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు. కెసిసి బ్యాంక్ చైర్మన్ ఈశ్వర చంద్ర పాణిగ్రహి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో గత ఆర్థిక సంవత్సరంలో రూ.12 కోట్ల 51 లక్షలు లాభం ఆర్జించిందని, అంతకు ముందు సంవత్సరం కన్నా 5.89 శాతం అధికమని పాణిగ్రహి వెల్లడించారు. 2025–26లో లాభాలను మరింతగా పెంచేందుకు బ్యాంక్ సిబ్బంది ప్రతీ ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బ్యాంక్ ప్రధాన లక్ష్యం అవిభక్త కొరాపుట్‌లో వ్యవసాయ ప్రగతికి, రైతుల ఆర్థిక ఉన్నతికి చేయూత ఇవ్వడమేనన్నారు. అవిభక్త కొరాపుట్ రాయగడ, నవరంగపూర్, నవరంగపూర్, కొరాపుట్ జిల్లాలో 338 లేంపులు, ఒక మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయని, కెసిసి బ్యాంక్ ఏర్పడి 75 ఏళ్లు గడిచాయని వెల్లడించారు. నేటికీ బ్యాంక్ సొంత నిధి రూ.175.11 కోట్లకు చేరగా, బ్యాంక్ డిపోజిట్లు రూ.654కోట్ల 63 లక్షలకు చేరిందని వెల్లడించారు. 2023–24 నాటకి ఖరీఫ్ వ్యవసాయానికి 103299 మంది రైతులకు రూ.52,314.04 లక్షలు, రబీ లో 106017 మంది రైతులకు రూ.53586.25 లక్షల వ్యవసాయ రుణాలు అందజేసినట్లు వెల్లడించారు. 1194 స్వయం సహాయక గ్రూప్‌లకు రూ.2393 .94 లక్షలు, బలరాం పథకంలో రూ.366 కోట్లు, బలియ పథకంలో 67 చేనేత పనివారిని రూ.33.50 లక్షలు, మా రుణ పథకంలో 62 మంది లబ్ధి దారులకు రూ.89లక్షలు, మిషన్ శక్తి పథకంలో 469 మంది లబ్ధిదారులకు రూ.457 .07 లక్షల రుణాలు అందించినట్లు తెలిపారు. కేసీసీ బ్యాంక్ కార్యదర్శి అతుల్య కుమార్ మల్లిక్, బ్యాంక్ ఏజీఎం హరికృష్ణ బనగాడి, నాలుగు జిల్లాల బ్యాంక్ శాఖల అధికారులు, బ్యాంక్ డైరెక్టర్లు, సభ్యులు, లేంప్స్ అధికారులు పాల్గొన్నారు.
లాభాల బాటలో కేసీసీ బ్యాంక్