● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
● భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
పర్లాకిమిడి: తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో గజపతి జిల్లాలో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు కలెక్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా చేశారు. తొలుత భారతీయ మజ్దూర్ సంఘ్, ఆల్ ఇండియా అంగన్‌వాడీ లేడీస్ వర్కర్స్ సంఘం కార్యకర్తలు, హెల్పర్లు రాజవీధి నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ జరిపారు. అంగన్‌వాడీ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులవలే గుర్తింపు, సమాన పనికి సమాన వేతనం, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, రిటైర్‌మెంట్ తరువాత కనీస పింఛన్ రూ.5 వేలు మంజూరు చేయాలని అంగన్‌వాడీ వర్కర్లు సంఘం అధ్యక్షురాలు కున్నీ జెన్నా అన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షులు సుజిత్ ప్రధాన్, అంగన్‌వాడీ వర్కర్ల సంఘం కార్యదర్శి పుష్పాంజలి పండా, అధ్యక్షురాలు కున్ని జెన్నాలు డిప్యూటీ కలెక్టర్ కమలకాంత పండాను కలుసుకుని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. నిరసన కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ్ కార్యదర్శి అంజలీ నాయక్, జిల్లాలోని ఏడు సమితి కేంద్రాల నుంచి హెల్పర్లు, వర్కర్లు పాల్గొన్నారు.
కదంతొక్కిన అంగన్‌వాడీలు
కదంతొక్కిన అంగన్‌వాడీలు