
దళితులంటే రఘురామకు చులకన
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): బాధ్యత గల డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న రఘురామ కృష్ణంరాజుకు దళితులంటే చులకన భావమని దళిత సంఘాల జేఏసీ నేతలు మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో చెరువుల ఆక్రమణ తొలగించడంతో నిరాశ్రయులైన దళితులు, బడుగు బలహీన వర్గాల వారిని పరామర్శించేందుకు ఎయిమ్ నాయకులు వెళ్లగా.. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు వచ్చారని రఘురామకృష్ణంరాజు తప్పుడు ప్రచారాలు చేయడాన్ని వారు ఖండించారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హాల్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా గౌరవాధ్యక్షుడు కళ్లేపల్లి రామ్‌గోపాల్, జిల్లా అధ్యక్షుడు కంఠ వేణు, జేఏసీ నాయకులు యజ్జల గురుమూర్తి, ఒంపూరు రమేష్ తదితరులు మాట్లాడారు. ఆకివీడులో బాధితులను పరామర్శించేందుకు ఎయిమ్ స్టిక్కర్లు ఉన్న వాహనంలో దళిత నేతలు వెళ్లడం నేరమెలా అవుతుందని ప్రశ్నించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్‌కుమార్‌పై అనవసర వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయాన్ని సునీల్‌కుమార్‌కు ఆపాదించడం అలవాటైపోయిందని ధ్వజమెత్తారు. దళితుల అభ్యున్నతి కృషి చేస్తున్న సునీల్‌కుమార్‌పై ఎందుకంత అక్కసని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు, ఎన్‌డీఏ ప్రభుత్వం అండదండలున్నాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. గతంలో అంబేడ్కర్ ఫ్లెక్సీని చించివేసినప్పుడు రఘురామకృష్ణంరాజుపై చట్టప్రకారం చర్యలు తీసుకోకుండా వదిలేశారని గుర్తు చేశారు. సమావేశంలో కొర్రాయి ప్రసాద్, పురుషోత్తం రాంబాబు, అబ్బాస్, లింగాల దిలీప్, పెయ్యల చంటి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment