కృష్ణలంక(విజయవాడతూర్పు): ఏఎన్‌ఎం/జీఎన్‌ఎం, బీఎస్‌సీ నర్సింగ్ పూర్తి చేసిన ఎస్సీ మహిళలకు 3 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఇజ్రాయేల్ నర్సింగ్ ట్రైనింగ్ వర్క్ షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వీరాంజనేయస్వామి మాట్లాడుతూ పీఎం ఏజెఏవై కార్యక్రమంలో భాగంగా ఈ నైపుణ్య శిక్షణను ఏర్పాటు చేశామన్నారు. విశాఖ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు కేంద్రాలుగా తొలి విడతగా 1100 మందికి శిక్షణ ఇస్తున్నామని, శిక్షణ అనంతరం ఇజ్రాయేల్‌లో నెలకు రూ.2లక్షల వేతనంతో ఉపాధి కల్పిస్తామన్నారు. ఇప్పటికే జర్మన్ లాంగ్వేజ్‌లో 300మందికి శిక్షణ ఇచ్చామని, వారికి జర్మనీలో ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పి.విజయ్‌కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్, ఏపీఎస్‌డబ్ల్యూర్‌ఈఐఎస్ కార్యదర్శి తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఖాతాలోని రూ.8.50 లక్షలు మాయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): కృష్ణలంక ప్రాంతంలో నివసిస్తూ ప్రభాస్ కళాశాల వద్ద రైతు బజారులో కూరగాయలు వ్యాపారం చేసుకునే వ్యక్తికి రుణం ఇప్పించి, తన ఖాతాలో సొమ్ము ఇతర అకౌంట్స్‌కు బదిలీ చేసిన ఘటనపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇవి.. కృష్ణలంకకు చెందిన కూరగాయల వ్యాపారి ఇంటి పక్కనే మేకల విజయలక్ష్మి నివాసం ఉంటుంది. ఒక రోజు ఆ వ్యాపారి సిబిల్ చూసిన విజయలక్ష్మి, మీ సిబిల్ బాగుంది లోన్ వస్తుంది అని నమ్మబలికింది. ‘ఒక ఆమెకు డబ్బులు కావాలి, ఆమె పేరుతో ఉన్న ఇంటిని మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు.. మీ పేరుతో రుణం తీసుకుంటారు’ అని నమ్మబలికారు. అందులో భాగంగా ఇంటి స్థలం వ్యాపారి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి, మళ్లీ దానిని తనఖా పెట్టించారు. అనంతరం వ్యాపారి పేరుతో యాక్సెస్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించిన విజయలక్ష్మి, లోకేష్, సంపత్ అనే వాళ్లు రుణం కోసం అప్‌లై చేయించి, రూ.8.50 లక్షలు వ్యాపారి ఖాతాలో జమచేశారు. కాగా ఆ ఖాతా ఫోన్ నంబరు వ్యాపారిది కాకుండా వాళ్లది ఇచ్చి, డబ్బులు పడిన తర్వాత విడతల వారీగా విత్‌డ్రా చేశారు. కొంత కాలం తర్వాత వ్యాపారి ఈఎంఐలు చెల్లించడం లేదని బ్యాంకు నుంచి ఒత్తిడి చేస్తుండగా, వెళ్లి ఖాతా చెక్ చేయగా, ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. దీంతో మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుణదల(విజయవాడ తూర్పు): తాళం వేసి ఉన్న తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారు నగలు చోరీ చేశారంటూ ఓ మహిళ మాచవరం పోలీసులను ఆశ్రయించిన సంఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్‌ఐసీ కాలనీకి చెందిన చిరువెళ్ల స్వాతి ప్రకాష్(41) పుష్ప హోటల్ సెంటర్‌లో ఓ జాతీయ బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తోంది. గత నెల 19న ఓ శుభ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో తన బీరువవాలో ఉన్న నగలు తీసుకునే ప్రయత్నం చేయగా ఆభరణాలు కన్పించలేదు. ఇల్లంతా వెతికినా, ఇరుగు పొరుగు వారిని విచారించినా ఫలితం లేకపోయింది. తన నగలు చోరీకి గురైనట్లు నిర్ధారించుకున్న ఆమె మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు రూ.4 లక్షల విలువైన 37 గ్రాముల ఆభరణాలు పోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు.


