కుట్రలు రీ కౌంటింగ్‌ | - | Sakshi
Sakshi News home page

కుట్రలు రీ కౌంటింగ్‌

Nov 8 2026 10:36 AM | Updated on Nov 8 2026 10:36 AM

కుట్రలు రీ కౌంటింగ్‌

ఎన్టీఆర్‌ జిల్లాలో..

మైలవరం మండలంలో

● వైఎస్సార్‌ సీపీ గెలిచిన చోట్ల

రీ పోలింగ్‌ అంటూ గందరగోళం

● తమ ఖాతాలో వేసుకునేందుకు కుట్రలు

● కొన్నిచోట్ల వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను

అనుమతించకుండా ఇబ్బందులు

● బ్యాలెట్‌ సరిగా చూపడం

లేదని వివాదం

● గన్నవరం, జగ్గయ్యపేట, వీరులపాడు

జెడ్పీటీసీ స్థానాల్లో రీ కౌంటింగ్‌

కోసం కూటమి పట్టు

● కూటమి కుట్రలు చేసినా ఆ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ విజయం

కొండపల్లి జెడ్పీ బాలికల పాఠశాలలో ఓట్లను లెక్కిస్తున్న పోలింగ్‌ సిబ్బంది

ఎన్టీఆర్‌ జిల్లాలో 16 జెడ్పీటీసీలు ఉండగా అందులో జగ్గయ్యపేట, వీరులపాడు జెడ్పీటీసీలో వైఎస్సార్‌ సీపీ విజయకేతనం ఎగురవేసింది. 13 స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో బీజేపీ గెలవగా, జనసేనకు కేటాయించిన రెండు సీట్లలో ఒక్క జెడ్పీటీసీ కూడా దక్కలేదు. 276 ఎంపీటీసీల్లో ఎన్నికలు జరగగా 50 స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపొందగా, 201 స్థానాల్లో టీడీపీ, 22 స్థానాల్లో జనసేన, సీపీఎం ఒక స్థానంలో బీఎస్‌పీ ఒక స్థానంలో, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందాయి.

పెనమలూరు మండలం గంగూరు–2 ఎంపీటీసీ సెగ్మెంట్‌లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గొల్లపల్లి భారతి 20 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇది ఓర్వలేని టీడీపీ నాయకులు రీ కౌంటింగ్‌ చేసేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అక్కడ రీ కౌంటింగ్‌ చేయటంతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థికి ఏడు ఓట్లు పెరిగాయి. మళ్లీ రీ కౌంటింగ్‌కు టీడీపీ నాయకులు పట్టుపట్టారు. ఈసారి మరో రెండు ఓట్లు పెరిగి మొత్తం 29 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గెలు పొందారు.

మైలవరం మండలం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. మండలంలోని వెల్వడం–1 సెగ్మెంట్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పత్తిపాటి దాసు 123 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పుల్లూరు–2సెగ్మెంట్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కుప్పాల రత్నకుమారి 22 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ రెండు సెగ్మెంట్‌లను రీ కౌంటింగ్‌ చేయాలంటూ టీడీపీ, జనసేన నాయకులు పట్టుబట్టారు. దీనికి ముందు పుల్లూరు–1 సెగ్మెంట్‌లో టీడీపీ 14 ఓట్లతో గెలుపొందగా ఇన్‌వ్యాలీడ్‌ ఓట్లు కలిపి లెక్కించారంటూ మళ్లీ రీకౌంటింగ్‌ చేయాలని వైఎస్సార్‌ సీపీ కోరినా.. ఎమ్మెల్యే వసంత ప్రోద్బలంతో అధికారులు టీడీపీ అభ్యర్థి గెలిచినట్లుగా డిక్లరేషన్‌ ఇచ్చి పంపారు. వైఎస్సార్‌ సీపీ రీ కౌంటింగ్‌ కోరితే పట్టించుకోని అధికారులు ఇద్దరు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు గెలుపొందితే ఎలా రీ కౌంటింగ్‌ పెడతారంటూ ఆ పార్టీ నాయకులు ధర్నాకు దిగారు. దీంతో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించారు.

సాక్షి ప్రతినిధి, విజయవాడ: మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు తరహాలోనే కూటమి నేతలు ‘ప్రాదేశిక’ ఓట్ల లెక్కింపులోనూ రీ కౌంటింగ్‌ పేరుతో కుట్రలకు తెరతీశారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయం సాధించిన ప్రతిచోటా రీ కౌంటింగ్‌ పేరుతో హడావుడి చేశారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫలితాలు తారుమారు చేయాలనే ప్రయత్నాలకు తెరతీశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌ సీపీ గెలిచిన గన్నవరం, జగ్గయ్యపేట, వీరులపాడు జెడ్పీటీసీల్లో కూటమి నేతలు రీకౌంటింగ్‌కు పట్టు పట్టారు. ఎన్ని కుట్రలు చేసినా ఈ మూడింటిలో వైఎస్సార్‌ సీపీనే విజయం సాధించింది. అంతిమంగా ఓటరు తీర్పే నిలిచింది.

గన్నవరంలో వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి అనగాని రవి విజయం సాధించారు. తొలుత ఆయనకు 63 ఓట్ల మెజార్టీ వచ్చింది. అక్కడ బీజేపీ అఽభ్యర్థిగా పోటీ చేసిన చిగురుపాటి కుమారస్వామి రీ కౌంటింగ్‌కు పట్టుపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే కూడా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. విషయం తెలిసిన వైఎస్సార్‌ సీపీ నేత వల్లభనేని వంశీ కౌంటింగ్‌ సెంటర్‌కు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆయన ఎన్నికల సంఘానికి, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా జేసీ నవీన్‌ అక్కడికి చేరుకుని ఇద్దరు అభ్యర్థులతో మాట్లాడి చెల్లని 1810 ఓట్లను మళ్లీ లెక్కించ డానికి అంగీకరించారు. వీటిని లెక్కించగా ఇందులో 108 ఓట్లు చెల్లుబాటవుతాయని నిర్ధారించారు. ఇవి కూడా చెరి సమానంగా రావడంతో అనగాని రవి 63 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించి డిక్లరేషన్‌ ఇచ్చేశారు. అయితే అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు హంగామా చేసే ప్రయత్నం చేశారు.

జగ్గయ్యపేటలో వైఎస్సార్‌ సీపీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన మండవ శ్రీనివాస గౌడ్‌ 1,186 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినా కూటమి నేతలు రీ కౌంటింగ్‌కు పట్టుబట్టారు. తర్వాత కూడా 1108 ఓట్లు మెజార్టీ రావడంతో శ్రీనివాస్‌గౌడ్‌కు డిక్లరేషన్‌ ఇచ్చారు.

నందిగామ నియోజకవర్గం వీరులపాడులో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఇప్పల కృష్ణారెడ్డి 496 ఓట్ల మెజార్టీతో జెడ్పీటీసీగా గెలుపొందగా కూటమి నేతలు రీ కౌంటింగ్‌కు కుట్రలు చేశారు. అయితే రిటర్నింగ్‌ అధికారి అంగీకరించలేదు.

తెన్నేరు ఎంపీటీసీ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మేకల శ్రీనివాసరావు, తన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మేకల చిన్నబాబుపై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. డిక్లరేషన్‌ ఫారాలపై సంతకాలు చేసిన తర్వాత టీడీపీ దొంగ నాటకానికి తెరతీసింది. కౌంటింగ్‌ కేంద్రం వెలుపల ఉన్న ఆ పార్టీ ఏజెంట్లు, అభ్యర్థులు ఇచ్చిన సలహాలతో వెంటనే రీ కౌంటింగ్‌ చేయాలంటూ అడ్డం తిరిగారు. అధికారుల వద్దకు పంచాయితీ వెళ్లింది. కౌంటింగ్‌ వివరాలను అధికారులు రౌండ్ల వారీగా స్పష్టం చేయడంతో చేసేది లేక టీడీపీ వెనక్కి తగ్గింది. పలుచోట్ల కౌంటింగ్‌ ఏజెంట్లనూ కూటమి నేతలు అడ్డుకున్నారు.

చల్లపల్లి మండలం మంగళాపురం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి డొక్కు నాగేశ్వరరావు 350 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అక్కడ కూడా టీడీపీ నేతలు రీ కౌంటింగ్‌కు పట్టుపట్టారు. 350 మెజార్టీ ఉండగా రీ కౌంటింగ్‌ ఏమిటని అధికారులు తిరస్కరించారు.

ఉంగుటూరు మండలం తేలప్రోలు ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి 39 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ కూడా రీ కౌంటింగ్‌ చేయగా 39 ఓట్లు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి మెజార్టీ రావటంతో టీడీపీ నాయకులు ఓటమి చవిచూశారు.

పమిడిముక్కల మండలం లంకపల్లి ఎంపీటీసీ స్థానంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గండ్రపు సౌజన్య 26 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ కూడా టీడీపీ నాయకులు రీ కౌంటింగ్‌ కోరడంతో అధికారులు రీ కౌంటింగ్‌ నిర్వహించారు. అయినా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థినే విజయం వరించింది.

జగ్గయ్యపేట పట్టణం ఏజీఎస్‌ కాలేజీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్‌ సీపీ కౌంటింగ్‌ ఏజెంట్లను పోలీసులు అడ్డుకున్నారు. రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) పరిశీలించి కౌంటింగ్‌ ఏజెంట్లుగా అనుమతి పత్రాలు జారీ చేసిన తర్వాత కూడా, వారిపై కేసులు ఉన్నాయనే కారణంతో పోలీసులు కౌంటింగ్‌ కేంద్రం వెలుపలే అడ్డుకోవడంపై ఆ పార్టీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయవాడ మాంటిస్సోరి కౌంటింగ్‌ కేంద్రంలో టీడీపీ ఏజెంట్లను ఎక్కువమందిని అనుమతించి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను అనుమతించకపోవడంపై వివాదం చెలరేగింది. ఇబ్రహీంపట్నం కొటికలపూడి సెగ్మెంట్‌కు జరిగిన పోలింగ్‌లో ఐదు ఓట్లు గల్లంతు కావడంపై అభ్యర్థితో పాటు వైఎస్సార్‌ సీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. బ్యాలెట్‌ పేపర్లు కట్టలు కట్టే సమయంలో పోలింగ్‌ అయిన ఓట్లు కంటే ఐదు ఓట్లు తక్కువ రావడాన్ని ఏజెంట్లు గుర్తించి అధికారులను ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement