కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ | - | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌

Nov 7 2026 2:00 AM | Updated on Nov 7 2026 2:00 AM

కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ పరిషత్‌ పోరులో తీర్పు నేడే

విజయోత్సవ

ర్యాలీలకు అనుమతి లేదు

జిల్లాలో 16 జెడ్పీటీసీ, 276 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జిల్లాలో 9 కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ 18 కౌంటింగ్‌ హాల్స్‌, 281 కౌంటింగ్‌ టేబుళ్లు అభ్యర్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌

పరిషత్‌ పోరులో తీర్పు నేడే

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలోని 16 మండలాల జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 16 జెడ్పీటీసీ, 276 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం కొద్ది గంటల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపునకు 9 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 18 కౌంటింగ్‌ హాల్స్‌, 281 కౌంటింగ్‌ టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. మొత్తం 1500 మంది సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, సహాయ సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొననున్నారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఉదయం 8 గంటల నుంచి పోలైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.

కౌంటింగ్‌ కేంద్రాలు ఇవే..

ఏ.కొండూరు, విస్సన్నపేట, తిరువూరు, గంపలగూడెం మండలాల సెగ్మెంట్లు తిరువూరులోని శ్రీవాహిని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల కేంద్రం, విజయవాడ రూరల్‌ మండలానికి సంబంధించి విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం, ఓల్డ్‌ మాంటిస్సోరి కళాశాల, జి.కొండూరు మండలం ఓట్లు లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, మైలవరం, రెడ్డిగూడెం మండలాల ఓట్ల లెక్కింపు లకిరెడ్డి హనిమిరెడ్డి ఇండోర్‌ స్టేడియం(మైలవరం), ఇబ్రహీంపట్నం ఓట్ల లెక్కింపు జెడ్పీ బాలికల హైస్కూల్‌(కొండపల్లి), జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల ఓట్ల లెక్కింపు ఎస్‌జీఎస్‌ కళాశాల(జగ్గయ్యపేట), నందిగామ ఓట్లు జిల్లా పరిషత్‌ హై స్కూల్‌(నందిగామ), చందర్లపాడు ఓట్ల లెక్కింపు కేవీఆర్‌ డిగ్రీ కళాశాల(నందిగామ), కంచికచర్ల, వీరులపాడు మండలాల ఓట్ల లెక్కింపు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌(కంచికచర్ల)లో జరుగుతుంది.

పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: కలెక్టర్‌ లక్ష్మీశ

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు. శుక్రవారం కలెక్టర్‌ లక్ష్మీశ, జెడ్పీ సీఈవో పి.సుశీల, విజయవాడ ఆర్‌డీవో వెన్నెల శ్రీను, రిటర్నింగ్‌ అధికారి కేవీఎస్‌ఆర్‌ రవికుమార్‌తో కలిసి విజయవాడ సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద గల మాంటిస్సోరి కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విజయవాడ రూరల్‌ కౌంటింగ్‌ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కౌంటింగ్‌ కేంద్రంలోనికి గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామన్నారు. రిటర్నింగ్‌ అధికారులు రౌండ్ల వారీగా వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ధ్రువీకరించిన తర్వాత ఎన్నికల ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాలు, బయట ప్రదేశాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఓట్ల లెక్కింపును ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తిచేసేలా దిశానిర్దేశం చేసినట్లు పేర్కొన్నారు.

విజయవాడలోని మాంటిస్సోరి కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ టేబుళ్లు

ఎస్‌జీఎస్‌ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ లక్ష్మీశ

లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో శనివారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విజేతలు, వారి మద్దతుదారులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, డప్పు వాయిద్యాలతో కూడిన ప్రదర్శనలు నిర్వహించేందుకు అనుమతి లేదని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజాశాంతికి భంగం కలిగించేలా బాణసంచా కాల్చడం, అధిక శబ్దంతో కూడిన మైక్‌ సెట్లు, డీజేలను ఉపయోగించడం పూర్తిగా నిషిద్ధమని తెలిపారు. కమిషనరేట్‌ పరిధిలో సెక్షన్‌ 163 బీఎన్‌ఎస్‌ఎస్‌, పోలీసు చట్టం 30 అమలులో ఉన్నందున, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జగ్గయ్యపేట: జిల్లాలో నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్‌జీఎస్‌ కళాశాలలోని జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాలకు సంబంధించిన కౌంటింగ్‌ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లో కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ సిబ్బంది, కౌంటింగ్‌ ఏజెంట్లు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలన్నారు. ముందుగా ఆయన చిల్లకల్లు మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహిస్తున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియను పరిశిలించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో అనీల్‌కుమార్‌, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఆర్‌. రమేష్‌బాబు, వీఎస్‌వీ ఈశ్వరరావు, తిరుమలాదేవి, తహసీల్దార్‌ శిరీష, ఎంపీడీవో అరుణకుమారి, సీఐ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్‌ జేఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement