మోదుగుపల్లిలో పోలింగ్ కేంద్రంలో వ్యక్తిపై దాడి
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసిన టీడీపీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు చెదురుమదురు ఘటనల మధ్య ముగిశాయి. జిల్లాలో 16 జెడ్పీటీసీ, 276 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 75.30 శాతం పోలింగ్ నమోదయింది. మొత్తం 8,35,515 మంది ఓటర్లకు గాను 6,29,122 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పలు మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు. వత్సవాయి మండలంలో వత్సవాయి, తాళ్లూరు, పెంట్యాలవారిగూడెం, దబ్బాకుపల్లి గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు చీఫ్, బూత్ ఏజెంట్లను ఉదయం ఏడు గంటలకే వారిపై కేసులు ఉన్నాయంటూ పోలీసులు వారిని బూత్‌ల్లోకి వెళ్లకుండా అడ్డుకుని స్థానిక పోలీస్‌స్టేషన్ తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మధ్యాహ్నం 12 గంటలకు వారిని పంపించి వేశారు.
అనుమంచిపల్లిలో టీడీపీ కవ్వింపు చర్యలు
జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నాయకుడు రాళ్లు రువ్వగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెద్ద పొంగు నాగరాజు చెవికి తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు.
కంకిపాడులో యథేచ్ఛగా రిగ్గింగ్
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు పోలింగ్ బూత్‌లో కూడా ఆఖరి గంటలో యథేచ్ఛగా రిగ్గింగ్ చేశారు. బయట నుంచి 70 మంది కుర్రాళ్లను తీసుకువచ్చి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మనుషులు ఈ రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో పోలింగ్ బూత్ నంబర్లు 50, 51, 52లకు సమీపంలో జనసేన, టీడీపీ నాయకులు ప్రచారం చేయడాన్ని గమనించిన వైఎస్సార్ సీపీ కాపు నాయకుడు తోట తిరుపతిరావు జనసేన, టీడీపీ నాయకులను బయటకు పంపాలని లేదంటే తాము కూడా లోపలకి వస్తామంటూ పోలీసులను హెచ్చరించారు. ఈ క్రమంలో నువ్వెలా లోపలికి వస్తావంటూ పోలీసులు తిరుపతిరావుపై దౌర్జన్యానికి దిగారు. మైలవరం మండలంలోని కీర్తిరాయునిగూడెంలో పోలింగ్ బూత్ వద్ద భోజన విరామ సమయంలో ఇరువర్గాల ఏజెంట్లు బయటకు వచ్చిన సమయంలో వాగ్వాదం మొదలై ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
కంచికచర్లలో తోపులాట
కంచికచర్ల విజయరాణి స్కూల్‌లో 4వ సెగ్మెంట్ బూత్ నంబర్ 58లో ఓటు వేసేందుకు రెండు గంటల సమయం పట్టడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. కంచికచర్ల ఎంపీపీ ఎలిమెంటరీ మెయిన్ స్కూల్ వద్ద స్వల్ప తోపులాటలు జరగటంతో గ్రామీణ సీఐ వైవీఎల్ నాయుడు సిబ్బందితో రంగ ప్రవేశం చేసి బయట వ్యక్తులను బూత్‌ల వద్ద నుంచి బయటకు పంపారు. దీంతో వ్యవహారం సద్దుమణిగింది. ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో ఇరువురు వృద్ధులు ఎక్కువసేపు క్యూలైన్‌లో నిల్చోలేక ఓటు వేయడానికి ముందుకు వెళ్లేందుకు వాదులాటకు దిగారు. దీంతో ఇరుపార్టీల నాయకులు ఒకేచోటకు చేరగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. కిలేశపురం గ్రామంలో 221వ నంబర్ పోలింగ్ బూత్‌ను సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న జూపూడికి మార్చడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. విస్సన్నపేట మండలం కలగర గ్రామంలో జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైఎస్సార్ సీపీ నేతల మధ్య వాగ్వాదం జరగ్గా, పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల నాయకులను అక్కడి నుంచి చెదరగొట్టారు.
16 జెడ్పీటీసీ, 276 ఎంపీటీసీలకు
ముగిసిన ఎన్నికలు
జిల్లాలో 75.30 శాతం
పోలింగ్ నమోదు
వత్సవాయిలో వైఎస్సార్ సీపీ
పోలింగ్ ఏజెంట్ల అరెస్ట్
మోదుగుపల్లిలో పోలింగ్ కేంద్రంలో
వ్యక్తిపై దాడి
అనుమంచిపల్లిలో వైఎస్సార్ సీపీ
కార్యకర్తపై దాడి
వత్సవాయి మండలం పెద్ద మోదుగుపల్లి గ్రామంలో ఓటు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గ్రామానికి చెందిన పుల్లారావు అనే వ్యక్తిపై పోలింగ్ కేంద్రంలో ఉన్న కుర్చీతో దాడి చేశారు. దీంతో పుల్లారావు తలకు తీవ్ర గాయం అయింది. అనుమంచిపల్లి, కె.అగ్రహారం, చిల్లకల్లు, మల్కాపురం, గండ్రాయి, జయంతిపురం, షేర్‌మహ్మద్‌పేటలోని పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు ఓటర్లను ప్రలోభపరిచేందుకు ప్రయత్నిస్తుండగా ఆ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు ఎన్నికల అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే పోలీసులు వచ్చి వారిని మందలించి అక్కడ నుంచి పంపించి వేశారు. ఈ సందర్భంగా స్వల్ప లాఠీచార్జీ కూడా చేశారు.


