నిధుల దుర్వినియోగం కేసులో ముందస్తు బెయిల్‌ | - | Sakshi
Sakshi News home page

నిధుల దుర్వినియోగం కేసులో ముందస్తు బెయిల్‌

Nov 6 2026 2:20 AM | Updated on Nov 6 2026 2:20 AM

నిధుల దుర్వినియోగం కేసులో ముందస్తు బెయిల్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నేటి వరకు గడువు కృష్ణా వర్సిటీ ఆర్చరీ క్రీడాకారుల ఎంపిక పొంగిన ఏనుగుగడ్డ వాగు

విజయవాడలీగల్‌: ఓ సంస్థకు చెందిన కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళా ఉద్యోగి దేవరాజుగట్టు దుర్గాభవానికి విజయవాడ ఏడో అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి బందెల అబ్రహాం ముందస్తు బెయిల్‌ మంజూరుచేశారు. శ్రీహరనాథ్‌ ఆయిల్‌ ట్రేడర్స్‌ సంస్థలో గుమస్తా, వర్కర్‌గా విధులు నిర్వర్తించిన దుర్గాభవాని టాలీ అకౌంటింగ్‌ నమోదుల్లో అవకతవకలకు పాల్పడి రెండేళ్లలో సుమారు రూ.9.60 కోట్లు దుర్వినియోగం చేసినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో నిందితురాలి తరఫున న్యాయవాదులు సయ్యద్‌ మౌలా అలీ, యలమంచిలి నవ్యశ్రీ వాదనలు వినిపించారు. కేసులోని వాస్తవ పరిస్థితులు, ఆడిట్‌ నివేదికలు, టాలీ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, దర్యాప్తు పురోగతి తదితర అంశాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. కేసుకు సంబంధించిన కీలకమైన ఆర్థిక, ఇతర ఆధారాలు ఇప్పటికే దర్యాప్తు సంస్థ పరిధిలో ఉన్నాయని, వాటిని పరిశీలించడానికి నిందితురాలిని నిర్బంధంలో ఉంచాల్సిన అత్యవసరం లేదని, దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని న్యాయవాదులు వాదించారు. చట్టపరమైన అంశాలు, వివిధ న్యాయస్థానాల తీర్పులను ప్రస్తావించారు. ఇరుపక్షాల వాదనలు, కేసు డైరీ, రికార్డులను సమగ్రంగా పరిశీలించిన న్యాయమూర్తి అక్టోబర్‌ 30వ తేదీన ముందస్తు బెయిల్‌ మంజూరు చేశారు. రూ.50 వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తుతోపాటు అంతే మొత్తానికి ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని, పది రోజుల్లో సంబంధిత కోర్టు ముందు లొంగిపోయి, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని షరతులు విధించారు.

చిలకలపూడి(మచిలీపట్నం): ఉమ్మడి కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటరుగా నమోదుకు కావడానికి శుక్రవారం చివరి రోజని కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎలక్ట్రోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.ఎస్‌.కె.ఖాజావలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు వెంటనే ఫారం–19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ల జాబితాను కొత్తగా తయారు చేస్తారని, గతంలో ఓటర్లుగా నమోదైన ఉపాధ్యాయులు సైతం ప్రస్తుత ఎన్నికల కోసం కొత్తగా ఫారం–19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. గత ఎన్నికల సమయంలో 13,505 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు, ప్రస్తుతం 10,909 దరఖాస్తులు మాత్రమే అందాయని తెలిపారు. అర్హులైన ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ గడువు తేదీ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అసోంలోని తేజ్‌పూర్‌లో డిసెంబర్‌ 15 నుంచి 22వ తేదీ వరకు జరిగే అఖిల భారత స్థాయి ఆర్చరీ టోర్నీలో పాల్గొనేందుకు కృష్ణా యూనివర్సిటీ నుంచి క్రీడాకారులను ఎంపిక చేశామని వర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని గుణదల మహానాడు రోడ్డులోని వోల్గా ఆర్చరీ అకాడమీలో గురువారం ఈ ఎంపికలను నిర్వహించారు. నగరంలోని వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. 50 మీటర్ల కాంపౌండ్‌ పురుషుల విభాగంలో శాతవాహన కళాశాల నుంచి కె.భరత్‌కుమార్‌, సిద్ధార్థ మహిళా కళాశాల నుంచి మహిళల విభాగంలో బి.ప్రియ వైష్ణవి ఎంపిక చేశారు. యూనివర్సిటీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులను ఓల్గా ఆర్చరీ అకాడమీ చైర్మన్‌ చెరుకూరి సత్యనారాయణ, పీడీలు యుగంథర్‌, సంగీతరావు, శాతవాహన కళాశాల ప్రిన్సిపాల్‌ వి.శ్రీనివాసరావు అభినందించారు.

ఇబ్రహీంపట్నం: మురసు తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురిసి అధిక వర్షాలతో ఏనుగుగడ్డ వాగు పొంగి ప్రవహిస్తోంది. జూపూడి వద్ద చినలంక, పెదలంక గ్రామాలకు వెల్లే చప్టాపై నీరు ప్రవహించడంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితుల్లో పడవలను ఆశ్రయించి తమ గమ్యాలకు చేరుతున్నారు. విద్యార్థులు, చిరువ్యాపారులు, పాల వ్యాపారులు, కూరగాయల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లంక గ్రామాల్లో సాగులో ఉన్న సుమారు 100 ఎకరాల మినుమ పంట నీటి ముంపుకు గురై రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. వ్యవసాయ శాఖ అఽధికారులు పంట నష్టం అంచనాలు రూపొందించి పరిహారం వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement