వాణిజ్య పన్నుల శాఖలో అవినీతి తిమింగలాలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రానున్న దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా వ్యాపితంగా కోట్లాది రూపాయల బాణసంచాను వ్యాపారులను దిగుమతి చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న బడా వ్యాపారులందరూ ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టి అక్రమంగా సరుకును దిగుమతి చేసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాపితంగా భారీగా బాణసంచా విక్రయాలు జరుగుతాయి. కోట్లల్లో జరిగే ఈ వ్యాపారంలో ప్రభుత్వానికి చెల్లించే పన్నులు ఎగవేసి అక్రమ పద్ధతుల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. దానికి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సైతం కొమ్ము కాయటంతో ఇటు వ్యాపారులకు, అటు అధికారులకు ఆదాయం మూడుపువ్వులు ఆరు కాయలుగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గడిచిన నెల రోజులుగా ఎన్నికల హడావుడి నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా భారీగా సరుకును దిగుమతి చేసుకున్నట్లు పలువురు వ్యాపారులు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లా కేంద్రంగా భారీ వ్యాపారం
ఉమ్మడి కృష్ణాజిల్లా కేంద్రంగా బాణసంచాకు సంబంధించి భారీ వ్యాపారం జరుగుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా 40 మంది పెద్ద వ్యాపారులు కోట్లాది రూపాయల మేర వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారు. వారి నుంచి వందలాది మంది కొనుగోలు చేసి రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. పెద్ద వ్యాపారులు ఒక్కొక్కరు కనీసం రెండు నుంచి ఐదు కోట్ల మేర వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తారని అంచనా. ఈ వ్యాపారమంతా పండుగకు ముందు రెండు మూడు మాసాలుగా జరుగుతుంది. అయితే పండుగకు సరిగా 20 రోజులకు ముందు మొత్తం వ్యాపారాన్ని పూర్తి చేసేస్తారు.
వ్యాపారం కోట్లలో... బిల్లుల్లో మాత్రం వేలల్లో...
ఉమ్మడి జిల్లాలో సుమారుగా రూ.150 కోట్ల మేర వ్యాపారం జరుగుతుందని అంచనా. కానీ బిల్లుల విషయంలో అదంతా ఎక్కడా కానరాదు. కోట్లలో వ్యాపారం జరిగినా బిల్లుల్లో కేవలం వేలల్లో మాత్రమే దానిని చూపించటం ఇక్కడ విశేషం. కోటి రూపాయల వ్యాపారం చేసినా దానిని లక్ష కన్నా ఎక్కువ చూపించే పరిస్థితి ఎక్కడా లేదు. ఉమ్మడి జిల్లాలో విజయవాడలో అన్ని అనుమతులు ఉన్న పెద్ద వ్యాపారులు పది నుంచి పదిహేను మంది వరకూ ఉన్నట్లు చెబుతారు. జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, ఇబ్రహీంపట్నం, గన్నవరం, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం ప్రాంతాల్లోనూ పెద్ద వ్యాపారులు తమ వ్యాపారాన్ని కోట్లలో నిర్వహిస్తారు. కానీ బిల్లులు మాత్రం తూతూ మంత్రంగానే చూపిస్తారు.
అదే బాటలో మిగిలిన ప్రభుత్వ శాఖలు
బాణసంచా విక్రయాలు, నిల్వ చేసుకోవటానికి అనేక రకాల అనుమతులు కావాలి. పదుల సంఖ్యలో అనుమతులు ఉంటే, వందల సంఖ్యలో వ్యాపారులు ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారు. అయితే అధికారుల చెయ్యి తడిపితే ఎంతటి అనధికార అనుమతులైనా ఇట్టే వచ్చేస్తాయంటూ వ్యాపారులే చెబుతున్నారు. విజయవాడ భవానీపురం, గొల్లపూడి, గుడివాడ, నూజివీడు తదితర ప్రాంతాల్లో ఇళ్ల సముదాయాల మధ్యలో భారీగా గోడౌన్‌లు ఉన్నా వాటి గురించి పట్టించుకునే నాథుడు మాత్రం ఎవరూ లేరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాపితంగా విజయవాడ డివిజన్–1, విజయవాడ డివిజన్–2, విజయవాడ డివిజన్–3 పరిధుల్లో సుమారుగా 17 సర్కిల్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వీటిల్లో విజయవాడ డివిజన్–2లో రిటైల్ వ్యాపారులను మినహాయిస్తే విజయవాడ డివిజన్–1, డివిజన్–2 పరిధుల్లో హోల్‌సేల్ వ్యాపారులు అత్యధికంగా ఉన్నారు. వారి నుంచి లక్షలాదిగా ముడుపులు అధికారులకు అందుతున్నాయి. గత ఏడాది విజయవాడ డివిజన్–3 పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ముడుపుల విషయంలో అల్లరి జరిగి బయటకు పొక్కింది. దానిపై మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీనిపై కమిషనర్ కార్యాలయం వివరణ అడిగితే అదంతా తూచ్... అంటూ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. పండుగ ముందు రోజు కేవలం ఒకటి, రెండు గంటల్లో జరిగే వ్యాపారాన్ని నెలలో నిర్వహించే మొత్తం వ్యాపారంగా జరిగిందని నివేదికలు ఇవ్వటం విస్మయాన్ని కలిగిస్తుంది. దీనిని బట్టి అధికారుల చేతి వాటం ఎంతగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వానికి కోట్లాది రూపాయల కుచ్చుటోపీ
ఉమ్మడి జిల్లా వ్యాపితంగా
అనధికార బాణసంచా
ఎటువంటి బిల్లులు లేకుండా
భారీగా దిగుమతి
లక్షలాది రూపాయల ముడుపులతో
సై అంటున్న జీఎస్‌టీ అధికారులు
ఎన్నికల హడావుడిలో గుట్టుచప్పుడు
కాకుండా సరుకు దిగుమతి
అదే బాటలో మిగిలిన ప్రభుత్వ శాఖలు


