గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చెప్పారు. దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య సురక్షితంగా జరుపు కొనేలా టపాసుల దుకాణాల ఏర్పాట్లు, భద్రతా నిబంధనల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో శనివారం రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులతో దీపావళి టపాసుల దుకాణాల ఏర్పాట్లు, భద్రతా చర్యలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకే ప్రాంగణంలో గరిష్టంగా 50 దుకాణాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, ప్రతి దుకాణం మధ్య కనీసం మూడు మీటర్ల ఖాళీ స్థలం ఉండేలా చూడాలన్నారు. దుకాణాలను నివాస ప్రాంతాలు, అధిక జనసంచారం ఉండే ప్రాంతాలకు దూరంగా ఏర్పాటు చేయాలని సూచించారు. అగ్నినిరోధక నిర్మాణ సామగ్రితో షెడ్లు నిర్మించాలని, నాణ్యమైన విద్యుత్ వైరింగ్ ఏర్పాటు చేయాలని, దుకాణాల వద్ద దీపాలు, లాంతర్లు ఉపయోగించరాదని, టపాసుల డెమో లేదా టెస్ట్ నిర్వహించరాదని స్పష్టం చేశారు. ప్రతి దుకాణం వద్ద నీరు, ఇసుక బకెట్లు, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచాలన్నారు.
సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి
అత్యవసర పరిస్థితుల్లో 30 సెకన్లలోపు స్పందించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచాలన్నారు. సమీపంలో అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు అందుబాటులో ఉండాలని, దుకాణాలకు కనీసం 50 మీటర్ల దూరంలో టపాసులు కాల్చే ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. టపాసుల విక్రయ ప్రాంగణాల్లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి 10 నిమిషాలకు మైక్ ద్వారా భద్రతా సూచనలు ప్రసారం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనర సింహం, డీసీపీ అడ్మిన్ కేజీవీ సరిత, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఏవీ శంకరరావు, వీఎంసీ అడిషనల్ కమిషనర్ ఎ.రవీందర్‌రావు, వీఎంసీ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ సీహెచ్ రత్నబాబు, ఆర్డీవోలు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


