నిష్పక్షపాతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

నిష్పక్షపాతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ

Oct 25 2026 9:26 AM | Updated on Oct 25 2026 9:26 AM

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిబంధనల మేరకు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. స్థానిక మహాత్మగాంధీ నగర్‌లోని బాపులపాడు మండల పరిషత్‌ కార్యాలయంలో జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడితో కలిసి కలెక్టర్‌ డీకే బాలాజీ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నామినేషన్ల పరిశీలన జరుగుతున్న తీరు, ఎన్నికల నిబంధనల అమలును సమీక్షించారు. జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ బాలాజీ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. ఎన్నికల నిబంధనలు, నామినేషన్ల పరిశీలనపై రిటర్నింగ్‌ అధికారులకు ఎలాంటి సందేహాలు వచ్చినా వెంటనే నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా డౌట్‌ క్లియరెన్స్‌ కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు తెలిపారు. ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. ఎన్నికల ప్రతి దశలోనూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, పోలింగ్‌, ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికోసం శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన పోలీస్‌ బలగాలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం, బాపులపాడు తహసీల్దార్‌ బి.మురళీకృష్ణ, హనుమాన్‌జంక్షన్‌ సీఐ ఎల్‌.రమేష్‌, ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement