క్లీన్‌, గ్రీన్‌ విజయవాడే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

క్లీన్‌, గ్రీన్‌ విజయవాడే లక్ష్యం

Oct 25 2026 9:26 AM | Updated on Oct 25 2026 9:26 AM

‘సాక్షి’తో వైఎస్సార్‌ సీపీ మేయర్‌ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా నిత్యం వార్డుల్లో పర్యటించి సమస్యలు పరిష్కరిస్తా బుడమేరు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందేలా కృషి

డ్రెయినేజీని మెరుగుపరుస్తాం

మహిళలకు భద్రత

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ‘ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా పనిచేస్తా. ప్రతి రోజూ వార్డుల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తా’ అని వైఎస్సార్‌ సీపీ విజయవాడ మేయర్‌ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి హామీ ఇచ్చారు. గత ఐదేళ్ల తన పాలనలో విజయవాడ అభివృద్ధికి విశేష కృషి చేశానని గుర్తుచేశారు. ఆ కృషిని కొనసాగిస్తూ విజయవాడను సర్వతో ముఖాభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు. ఆమె శనివారం ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

బుడమేరు ముంపు సమస్యకు పరిష్కారం

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024లో విజయవాడను బుడమేరు ముంచేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 60 మంది మరణించారు. వంద రోజుల్లో బుడమేరు సమస్యను పరిష్కరిస్తామంటూ అప్పట్లో హామీలు గుప్పించి ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. మేము గెలిచిన తర్వాత భవిష్యత్‌లో బుడమేరు ముంపు సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తాం. వచ్చే ఐదేళ్లలో రోడ్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తాం. రోడ్డు పనుల నాణ్యతను తనిఖీ చేయడానికి ప్రత్యేక అధికారులను నియమించి అవినీతికి చెక్‌ పెడతాం. ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందిస్తాం. మా హయాంలో స్వచ్ఛమైన తాగునీరు అందించాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో డయేరియాతో ప్రజలు మృతి చెందే దుస్థితి నెలకొంది.

విజయవాడ నగరంలో మహిళలు, యువతుల భద్రత ప్రమాదకరంగా మారింది. పోలీసులే లాకప్‌ డెత్‌లు చేస్తున్న దుస్థితి నెల కొంది. కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు గాదె సాయికృష్ణను లాకప్‌లో చంపేశారు. గంజాయి బ్యాచ్‌ రోడ్లపై స్వైర విహారం చేస్తోంది. ఈ మధ్య కాలంలో మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో విజయవాడలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. ఈ అఘాయిత్యాలను నివారించడంలో మునిసిపల్‌ కార్పొరేషన్‌ పాత్ర కూడా కీలకం. వీధి లైట్లను ఎక్కువగా ఏర్పాటు చేస్తే మహిళలపై దాడులు చేయడానికి ఆకతాయిలు భయపడతారు. చీకటిగా ఉండే రోడ్లు, బస్టాప్‌లు, పార్కుల వద్ద స్ట్రీట్‌ లైట్లను మెరుగుపరుస్తాం.

నగరంలో లోతట్టు ప్రాంతాల్లో డ్రెయినేజీని మెరుగుపరుస్తాం. చంద్రబాబు ప్రభుత్వం గతంలో కేంద్రం ఇచ్చిన అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిధులు రూ.500 కోట్లు మళ్లించింది. ఆ నిధుల సాధన కోసం ప్రయత్నిస్తాం. విజయ వాడ సిటీ ఇమేజ్‌ను ఇంకా పెంచాల్సి ఉంది. శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి, ఇంటింటికీ చెత్త సేకరణ, తడి–పొడి చెత్త వేరుచేయడాన్ని మెరుగుపరుస్తాం. విజయవాడ వాసులకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తాం. గతంలో మా హయాంలో నగరంలోని ప్రధానమైన పార్కులన్నింటినీ అభివృద్ధి చేశాం. మిగిలిన వార్డుల్లోనూ పార్కుల అభివృద్ధి, నిర్వహణ చేపడతాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement