మచిలీపట్నంఅర్బన్: అర్ణబ్ తుపాను నేపథ్యంలో వాతావరణం అనుకూలించే వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని కృష్ణా జిల్లా మత్స్యశాఖ అధికారి ఎ.ఉషాకిరణ్ హెచ్చరించారు. తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపారు. బందరులోని మత్స్యకారుల ల్యాండింగ్ సెంటర్లను ఆమె శనివారం సందర్శించారు. నావలు, వలలు, ఇతర వేట పరికరాలను సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని సూచించారు. తుపాను తాజా సమాచారాన్ని మత్స్యకారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలని గ్రామ మత్స్య సహాయకులు (వీఎఫ్‌ఏలు), సాగరమిత్రలను ఆదేశించారు. ఈ పర్యటనలో మచిలీపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ చి.రమేష్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఎం.సలేహ, గ్రామ మత్స్య సహాయకులు, సాగరమిత్రలు పాల్గొన్నారు.
ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా విజయకుమార్ నియామకం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా రాష్ట్ర అటవీ అకాడమీ ప్రధాన అటవీ సంరక్షణాధికారి బి.విజయ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. విజయకుమార్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశను శనివారం కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ రోజు వారీ ఖర్చులు, బ్యాంకు ఖాతా లావాదేవీల రిజిస్టర్లను విజయకుమార్ ఎప్పటికప్పుడు తనిఖీ చేసి పర్యవేక్షిస్తారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు జరిగే నగదు, బహుమతులు, మద్యం పంపిణీలను అడ్డుకునేందుకు జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు, వీడియో సర్వైలెన్స్ టీమ్‌లు, అకౌంటింగ్ బృందాలతో సమన్వయం చేసుకుంటారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమాచారాన్ని 62810 72815 నంబరుకు అందజేయాలని కోరారు.
విద్యుత్ శాఖ సిబ్బంది సన్నద్ధంగా ఉండాలి
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అర్ణబ్ తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది ఎల్లప్పుడు అప్రమత్తంగా, సన్నద్ధంగా ఉండా లని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి ఆదే శించారు. గుణదలలోని సంస్థ కార్యాలయంలో సర్కిల్ పరిధిలోని ఆయా జిల్లాల ఎస్‌ఈలు, అధికారులతో ఆయన శనివారం వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంతో స్తంభాలు, విద్యుత్ లైన్లు దెబ్బతినే అవకాశం ఉన్నందున సిబ్బంది, వాహనాలు, మరమ్మతు పరికరాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. అన్ని సర్కిల్, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, విద్యుత్ ఉద్యో గులు సెలవులు తీసుకోవద్దని పేర్కొన్నారు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకవద్దని ప్రజలకు సూచించారు. విద్యుత్ ప్రమాదాలు లేదా సరఫరా అంతరాయాల సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
లఖ్‌పతి దీదీలతో కేంద్ర మంత్రి నిముబెన్ ముఖాముఖీ
భవానీపురం(విజయవాడపశ్చిమ): జాతీయ సరస్ మేళాను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిబాయ్ బాంబానియా శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలు, లఖ్‌పతిదీదీలతో ముఖాముఖా నిర్వహించి, వారి విజయగాథలను తెలుసుకున్నారు. అనంతరం నిముబెన్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థిక స్వాతంత్య్రం సాధిస్తూ వ్యాపారవేత్తలుగా, సంస్థల యజమానులుగా ఎదుగుతున్న తీరు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మార్గదర్శకత్వంలో మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడానికి, గ్రామీణ వ్యాపారాలను ప్రోత్సహించేందుకు, మార్కెటింగ్ అవకాశాలను విస్తరించడానికి సరస్ మేళాలు కీలక వేదికలుగా నిలుస్తున్నాయని తెలిపారు.


