అభివృద్ధి ఒట్టి మాట | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి ఒట్టి మాట

Oct 25 2026 9:26 AM | Updated on Oct 25 2026 9:26 AM

● ప్రైవేటు బాట..

నిర్వహణ గాలికి..

విజయవాడపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం

నగర ఆదాయం రాష్ట్ర ఖజానాకు మళ్లింపు

పనులు చేసిన కాంట్రాక్టర్లకు మొండిచేయి

అభివృద్ధి పేరుతో నగరంలోనిపార్కులు, రహదారులు ప్రైవేటు పరం

● ప్రైవేటు బాట..

సాక్షి ప్రతినిధి, విజయవాడ/పటమట: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. నగర అభివృద్ధికి నిధులు ఇవ్వకపోగా ఉన్న నిధులను కూడా ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తున్నారు. పక్కనే ఉన్న రాజధానికి రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం విజయవాడకు మాత్రం మొండిచేయి చూపిస్తోంది. అభివృద్ధికి వినియోగించాల్సిన నగరపాలక సంస్థ సాధారణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌, పురమిత్ర పేరుతో రాష్ట్ర ఖజానాకు తరలించుకుపోతోంది. ఫలితంగా నగరాభివృద్ధికి నిధుల కొరత ఏర్పడి చిన్న పనులు చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ దయాదాక్షణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది.

బకాయిలు ఘనం.. చెల్లించింది నామమాత్రం

నగర ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మళ్లించటంతో నగరంలో వివిధ అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో పడిపోయాయి. రూ.350 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో ఇటీవల కాట్రాక్టర్లు ధర్నాలు, అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన తెలప డంతో బ్యాంకు లోన్ల ద్వారా నగరపాలక సంస్థ నిధులను సమకూర్చి కాంట్రాక్టర్లకు రూ.50 కోట్ల మేర చెల్లింపులు పూర్తిచేసింది. కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్‌ కమిషన్‌ గ్రాంట్లు, వృత్తిపన్ను, ఇతర పన్నుల ద్వారా రావాల్సిన బకాయిలు రూ.1000 కోట్ల వరకు ఉన్నాయి. వీటిని కార్పొరేషన్‌ తిరిగి పొందితేనే అభివృద్ధి సాధ్యమవుతోంది.

పార్కులు, రోడ్లు ప్రైవేటుకు..

నగరంలోని ప్రధాన పార్కులను ప్రైవేటుపరం చేయటానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. కృష్ణలంకలోని రివర్‌ ఫ్రంట్‌ పార్కు, రాజీవ్‌గాంధీ పార్కు, అంబేడ్కర్‌ పార్కును అభివృద్ధి పేరుతో ప్రైవేటీకరణ చేపట్టింది. నగరంలోని అంబేడ్కర్‌ స్మృతివనం నిర్వహణ బాధ్యతలను ఏడాది క్రితం వరకు నగరపాలక సంస్థ పర్యవేక్షించేది. కూటమి ప్రభుత్వం స్మృతి వనాన్ని నిర్లక్ష్యం చేసి, దాని నిర్వహణను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. పబ్లిక్‌, ప్రైవేటు పార్టనర్‌షిప్‌ (పీపీపీ) పేరుతో నగరంలోని బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, భవానీపురం స్వాతి రోడ్డు, సాంబమూర్తి రోడ్డు, గురునానక్‌ రోడ్డు, పంట కాలువ రోడ్డు వంటి 19 ప్రధాన రహదారులను సైతం అభివృద్ధి పేరిట ప్రైవేటు పరం చేయడానికి సిద్ధమైంది.

ట్రాఫిక్‌ సమస్య జటిలం

నగరంలోని ప్రధాన ప్రాంతమైన బెంజిసర్కిల్‌ నుంచి ఆటోనగర్‌ వరకు సుమారు 3.5 కిలోమీటర్ల మేర రోడ్డును వెడల్పు చేయటానికి వీఎంసీ ఎన్‌హెచ్‌ఏఐ సిఫార్సు మేరకు విస్తరణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు నిర్వాసితులకు టీడీఆర్‌ (టాన్స్‌ఫర్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌) కూడా అందించారు. 100 అడుగులు విస్తరించటానికి రోడ్డుకు ఇరువైపులా కొంతమేర ప్రైవేటు నిర్మాణాలు తొలగించారు. ఇప్పటికే సైడు కాలువల నిర్మాణం కూడా చేపట్టారు. కూటమి ప్రభుత్వ వచ్చాక ఎమ్మెల్యేలే రంగంలోకి దిగి ఈ పనులు ఆపేశారు. ఫలితంగా నిత్యం ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య మరింత జటిలంగా మారింది. బెంజిసర్కిల్‌ వద్ద ఉన్న రెండు ఫ్లై ఓవర్ల కింది భాగంలో గ్రీనరీని ఏర్పాటు చేయటానికి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించి 32 రకాల మొక్కలను నాటారు. కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఓఅండ్‌ఎం (ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌) ద్వారా కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మొక్కలు ఎండిపోయి నీరు పోసే పరిస్థితి లేకుండా పోయింది.

విజయవాడ – గన్నవరం ఎయిర్‌పోర్టు మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రామవరప్పాడు రింగు నుంచి గన్నవరం వరకు బ్యూటిఫికేషన్‌–లిఫ్టింగ్‌కు నగరపాలక సంస్థ రూ.11 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించింది. రోడ్డుకు రెండు వైపులా అందమైన, నాణ్యమైన ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం వాటి నిర్వహణను వదిలేసింది. నగరంలో పెరు గుతున్న కాలుష్యాన్ని నిరోధించేందుకు కాలుష్య నియంత్రణ మండలి సిఫార్సు మేరకు రోడ్డుకు ఇరువైపులా దుమ్మూ, ధూళి లేవకుండా మూడు నియోజకవర్గాల పరి ధిలో ఎండ్‌ – టూ – ఎండ్‌ పేవర్‌బ్లాక్స్‌ను రూ.50 కోట్లు వెచ్చించి వేస్తే కూటమి ప్రభుత్వం వాటి నిర్వహణను పట్టించుకో లేదు. దీంతో అవి పగిలి చాలా ప్రాంతాల్లో ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement