వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు అపూర్వ ఆదరణ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులకు అపూర్వ ఆదరణ

Oct 25 2026 9:26 AM | Updated on Oct 25 2026 9:26 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): విజయవాడ నగరపాలక సంస్థ, మునిసిపాలిటీల్లో వైఎస్సార్‌ సీపీ మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. విజయవాడ కార్పొరేషన్‌, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి మునిసిపాలిటీల్లో మేయర్‌, చైర్మన్‌ అభ్యర్థులు, ఆయా డివిజన్లలో కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తూ, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం సాగిస్తున్నారు.

విజయవాడలో..

నగరంలోని 60వ డివిజన్‌ కాళేశ్వరరావు రోడ్డు, చిలుకు దుర్గయ్య వీధి ప్రాంతాల్లో మేయర్‌ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్‌ అభ్యర్థి యర్రంశెట్టి అంజిబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్ట్టారు. నగరాభివృద్ధిని కూటమి ప్రభుత్వం విస్మరించిందన్నారు. మేయర్‌ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో నగరంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు.

జగ్గయ్యపేటలో..

జగ్గయ్యపేట పట్టణంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఏడో వార్డులో చైర్‌పర్సన్‌ అభ్యర్థి హఫీజున్నీసా, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్‌ (చిన్న)తో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వారి ప్రచారానికి ప్రజల నుంచి మంచి లభించింది. ఆరు, ఏడు వార్డుల కౌన్సిలర్‌ అభ్యర్థులు బొజ్జ లక్ష్మి, పాగోల్‌ బ్యూలా ప్రియదర్శిని పాల్గొన్నారు.

తిరువూరులో..

తిరువూరు మునిసిపాలిటీ వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు, కౌన్సిలర్‌ అభ్యర్థి పాలం రమాదేవి ఏడో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. పార్టీ నాయకులు వెలుగోటి ఆదినారాయణ, గజ్జల సీతారామయ్య, తంగిరాల వెంకటరెడ్డి పాల్గొన్నారు.

నందిగామలో..

నందిగామ మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి చల్లా బ్రహ్మేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావుతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఓటర్లను కలుసుకుని వైఎస్సార్‌ సీపీని గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

కొండపల్లిలో..

కొండపల్లి మున్సిపాలిటీలోని 4, 5, 6, 7, 8, 9, 10 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ చైర్‌ పర్సన్‌ అభ్యర్థి నల్లమోతు తేజస్వి, వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మాజీ మంత్రి జోగి రమేష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జోగి రమేష్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో గద్దెనెక్కి సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేసిందన్నారు. కొండపల్లి అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement