విమానాశ్రయం(గన్నవరం): ఈ నెల 26న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ పర్యటనకు సంబంధించి భద్రత, ప్రొటోకాల్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ అధికారులకు సూచించారు. స్థానిక విమానాశ్రయంలో శనివారం ఉప రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు, ఐఎస్‌డబ్ల్యూ, హెచ్ఎఫ్ఏసీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.ఆరిఫ్ హఫీజ్, జిల్లా ఉప రాష్ట్రపతి భద్రత అధికారులు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి ఈ నెల 26న విమా నాశ్రయానికి చేరుకుని ఎన్టీఆర్ జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారని తెలిపారు. ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విమానాశ్రయంలో కంట్రోల్ రూమ్, గ్రీన్ రూమ్, వీఐపీ రిసెప్షన్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తిచేయాలని సూచించారు. ఉపరాష్ట్రపతి కాన్వాయ్ మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కీలక ప్రాంతాల్లో పటిష్టవంతమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య బృందాలు, అంబులెన్స్‌లు, అవసరమైన వైద్య పరికరాలు, అగ్నిమాపక శాఖ ఫైర్ టెండర్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని, ఎస్పీజీ సూచించిన భద్రత ప్రొటోకాల్‌ను తప్పక పాటించాలని సూచించారు. ఉప రాష్ట్రపతి సెక్యూరిటీ అండర్ సెక్రటరీ చందన్.డి, డీసీపీ బి.సత్యనారాయణ, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.


