కొండపలి(ఇబ్రహీంపట్నం): పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని కొండపల్లి మునిసిపాలిటీ వైఎస్సార్ సీపీ చైర్ పర్సన్ అభ్యర్థి నల్లమోతు తేజస్వి తెలిపారు. రాజకీయంగా 20ఏళ్లకు పైగా ఉన్న తమ కుటుంబ సభ్యులు వైఎస్సార్ సీపీలో పలు విభాగాల్లో పనిచేస్తున్నారని వెల్లడించారు. తాను కూడా గొల్లపూడి ఏఎంసీ డైరెక్టర్‌గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపారు. కొండపల్లి మునిసిపాలిటీలో వైఎస్సార్ సీపీ కచ్చితంగా పాలకవర్గం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్ సహకారంతో మునిసిపాలిటీలోని దీర్గకాలిక సమస్యల పరిష్కారం, స్వచ్ఛమైన తాగునీరు, కాలుష్యం నివారణే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఆదివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఆమె మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
మౌలిక వసతుల కల్పన..
గత వైఎస్సార్ సీపీ పాలనలో కొండపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో 3వేలకు పైగా ప్లాట్లు పేదలకు కేటాయించి నూతన కాలనీలు నిర్మించారు. కాలనీల్లో నివసించే కుటుంబాలకు కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది. కాలనీతో పాటు మునిసిపాలిటీ పరిధిలో ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, వీధి దీపాలు వంటి సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తా.
ప్రజల వైద్యం, ఆరోగ్యాలకు భరోసా..
ఎన్టీటీపీఎస్ బూడిద చెరువు, బూడిద రవాణా కారణంగా కొండపల్లి పరిసర ప్రాంతాల్లో దుమ్ము, కాలుష్యం సమస్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అనేక మంది శ్వాసకోశ, చర్మ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేలా ప్రయత్నిస్తా. ఎన్టీటీపీఎస్ ద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మాణానికి కృషి చేసి పేదలకు ఉచిత వైద్యంతో ఆరోగ్య భరోసాకు శాశ్వత పరిష్కారానికి పోరాడుతా.
చిరు వ్యాపారులకు చేదోడుగా..
మునిసిపాలిటీ పరిధిలో హైవే పక్కన చిరువ్యాపారాలు చేసుకుంటున్న వారిని నిర్ధాక్షిణ్యంగా తొలిగించడంతో వారి జోవనోపాధిపై పెద్ద దెబ్బ పడింది. వారికి శాశ్వత పరిష్కారం చూపేందుకు పనిచేస్తా. గత వైఎస్సార్ సీపీ పాలనలో పురుషులకు చేదోడు, వాహన మిత్రతో వంటి సథకాలతో లబ్ధి చేకూరగా, 67,515 మంది మహిళలకు రూ.200కోట్లకు పైగా ఆసరా, చేయూత వంటి పథకాలతో నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. ఇప్పుడు ఆ భరోసా వారికి లేకుండా పోయింది.
కొండపల్లి ప్రజలకు సురక్షితమైన తాగునీటిని నిరంతరాయంగా అందించేందుకు ప్రత్యేక తాగునీటి సరఫరా ప్రాజెక్టు అవసరం ఉంది. కృష్ణానది ఒడ్డున ఉన్న కొండపల్లికి పాలకుల నిర్లక్ష్యంతో తాగునీటి కష్టాలు రావడం దురదృష్టకరం. గత మునిసిపల్ ఎన్నికల సమయంలో ఇంటింటికీ తాగునీటి సరఫరాకు అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.57కోట్లు మంజూరు చేశారు. వీటితో పాటు జలజీవన్ మిషన్ నిధులు వచ్చినా ఇంటింటికీ కుళాయి కల నెరవేరలేదు. ప్రస్తుత పైలెట్ ప్రాజెక్ట్ కొండ పల్లితో పాటు నియోజకవర్గవ్యాప్తంగా 104 గ్రామాలకు తాగునీటి సరఫరా చేస్తున్నందున స్థానికంగా నీటి ఇబ్బందులు తలెత్తాయి. ప్రత్యేక ప్రాజెక్ట్‌తో ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నది ప్రధాన లక్ష్యం.
400 ఏళ్లకు పైగా చారిత్రక కలిగిన కొండపల్లి ఖిల్లా ప్రాశస్త్యాన్ని కాపాడుతూ.. కొండపల్లి బొమ్మల పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. ప్రత్యేక నిధులు, గ్రాంట్లు రప్పించి ఖిల్లా, బొమ్మల పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తా. కొండపల్లి బొమ్మల పరిశ్రమ కళాకారులు పడుతున్న ప్రధాన సమస్య అయిన తెల్లపొనికి కలప పెంపకం, ఆన్‌లైన్ మార్కెటింగ్ మెరుగు పరిచేందుకు అధికారులతో సంప్రదించి ప్రోత్సహిస్తా. తద్వారా పర్యాటకంగా కొండపల్లి పురోగభివృద్ధి సాధిస్తుందనే నమ్మకం ఉంది.


