ఉద్ధృతంగా గాలులు వీచే అవకాశం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి సోమవారం నాటికి తుపాను(అర్ణబ్)గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. అంతేకాక రాబోయే రెండు రోజుల్లో బలపడి తీవ్ర తుపాను మారవచ్చని, తాజా పరిస్థితిని బట్టి బుధవారం ఉదయం నాటికి బాపట్ల, విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెబుతోంది. ఆ సమయంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
అర్ణబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో 91549 70454తో కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. తుపాను ప్రభావంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు సహాయ, రక్షణ చర్యలు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది.
సర్వ సన్నద్ధంగా ఉండండి..
జిల్లాలో తుపాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్, పౌరసరఫరాలు, వైద్య, జలవనరులు తదితర శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రోడ్ల పక్కన ఉన్న భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. హోర్డింగ్‌ల ఫ్రేమ్‌లపై ఉన్న ఫ్లెక్సీలను తొలగించి ఖాళీగా ఉంచాలన్నారు. కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, పాత భవనాలు, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసిస్తున్న వారిని ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన పునరావాస కేంద్రాలుగా విద్యాసంస్థల భవనాలు, ఫంక్షన్ హాళ్లను సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యంగా తిరువూరు, విస్సన్నపేట, జగ్గయ్యపేట ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.


