స్మారక నిధి.. గాంధీగిరి | - | Sakshi
Sakshi News home page

స్మారక నిధి.. గాంధీగిరి

Oct 2 2026 7:14 AM | Updated on Oct 2 2026 7:14 AM

విజయవాడ పర్యాటకానికి కేరాఫ్‌గా గాంధీ హిల్‌

1962లో శంకుస్థాపన, 1968లో ప్రారంభం 1971లో నక్షత్ర ప్రదర్శన శాల ఏర్పాటు కొండపైన గాంధీజీ బోధనలను అందిస్తున్న గ్రంథాలయం మరిన్ని సదుపాయాల కల్పనకు నూతన పాలకవర్గం చర్యలు

గాంధీ బోధనలు అవసరం..

అద్భుతం.. నక్షత్ర ప్రదర్శనశాల

ఇదీ చరిత్ర..

నేడు సందర్శన ఉచితం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): భారతీయ స్వాతంత్య్ర సంగ్రామంలో కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ. కేవలం భారతీయులకే కాకుండా ప్రపంచంలోని నెల్సన్‌మండేలా, చార్లీచాప్లిన్‌ వంటి ఎందరో సుప్రసిద్ధ వ్యక్తులను తన బోధనలతో ప్రభావితం చేసిన స్ఫూర్తి ప్రధాత గాంధీ. అటువంటి మహాత్మునికి సంబందించిన వివరాలు నేటి తరానికి అందించేందుకు గొప్ప స్ఫూర్తి శిఖరంగా విజయవాడ నడిబొడ్డున ‘గాంధీహిల్‌’ వెలుగొందుతోంది. విజయవాడ రైల్వేస్టేషన్‌కు పశ్చిమాన సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండపై స్మారక కేంద్రంగా ఈ గాంధీహిల్‌ ఏర్పాటైంది.

కొండపైన స్మారక స్థూపం

కొండ పైభాగంలో 52 అడుగుల ఎత్తయిన స్థూపాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్థూపం కోసం అప్పటి గుంటూరుజిల్లా రెంటచింతల నుంచి ఎర్ర మార్బుల్‌ రాయిని తెప్పించారు. స్థూపంపై నడుస్తున్న బాపూజీని చిత్రీకరించారు. స్థూపం దిగువన చుట్టూ గాంధీజీ బోధనలను లిఖించారు. ఈ కొండపై నుంచి నగరం మొత్తం అత్యద్భుతంగా దర్శనమిస్తుంది.

విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయం..

గాంధీ స్మారక కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఏడాదే గ్రంథాలయాన్ని సైతం స్థాపించారు. ఇక్కడ గాంధీజీకి సంబంధించిన ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. గాంధీజీ జీవితాన్ని ఈ గ్రంథాలయం చాలా చక్కగా ఆవిష్కరిస్తుంది. అలాగే గాంధీజీ జీవితంలోని అనేక ఛాయచిత్రాలు (ఫొటోలు) ఉండేవి. ప్రస్తుతం ఆ ఫొటోలు అందుబాటులో లేవు.

ఎప్పుడూ మరమ్మతుల్లోనే..

గాంధీహిల్‌పై అందరినీ అలరించే మరో గొప్ప ఆకర్షణ పిల్లల రైలు (టాయ్‌ ట్రైన్‌) భూమికి రెండు వందల అడుగుల ఎత్తులో కొండ చుట్టూ తిరిగేలా దీనిని ఏర్పాటు చేశారు. ఈ ట్రైన్‌ను 1969లో అందుబాటులోకి తెచ్చారు. దీనిని భారతీయ రైల్వే ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందించిందని చెబుతున్నారు. దీనిపై ప్రయాణం చేస్తూ విజయవాడ నగర అందాలను తిలకించవచ్చు. అయితే ఇది సైతం ప్రస్తుతం మరమ్మతుల్లో ఉంది.

సందర్శించిన గాంధీజీ వారసులు..

గతంలో గాంధీజీ మనుమడు, చిత్రకారుడు ఆచార్య రాజమోహన్‌గాంధీ దంపతులు గాంధీహిల్‌ను సందర్శించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే గాంధీజీ మునిమనమడు ఆనంద్‌గోఖనీ సైతం గాంధీహిల్‌ను సందర్శించి గాంధీ మహాత్మునికి నివాళులర్పించారు.

మరిన్ని సదుపాయాలు..

గాంధీహిల్‌కు నూతనంగా వచ్చిన పాలకవర్గం మరిన్ని సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తోంది. కొండపైన ఉన్న పరిసరాలను ఆహ్లాదంగా తీర్చిదిద్దటంతో పాటుగా స్థూపం వద్దకు వెళ్లేందుకు వీలుగా లిఫ్ట్‌ సదుపాయాన్ని ఇటీవలే ప్రారంభించారు.

మూలకు చేరిన టాయ్‌ ట్రైన్‌

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లిఫ్ట్‌, ర్యాంప్‌

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో యుద్ద వాతావరణం కొనసాగుతోంది. చాలా దేశాల్లో భయంకరమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గాంధీజీ బోధనలు ఈ సమాజానికి చాలా అవసరం. ఆయన అందించిన శాంతి సందేశాన్ని నేటి తరం అందిపుచ్చుకోవాలి. గాంధీజీ బోధనలను మరింత విస్తృతం చేసేందుకు గాంధీహిల్‌ ద్వారా పలు కార్యక్రమాలను చేపట్టనున్నాం. ప్రతి ఒక్కరూ గాంధీహిల్‌ను సందర్శించాలి.

– డాక్టర్‌ గాంధీ పీసీ కాజా,

చైర్మన్‌, గాంధీ ఫౌండేషన్‌

విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడిగా పని చేసిన సుప్రసిద్ధ ఇంజినీర్‌ కేఎల్‌రావు కృషి ఫలితంగా గాంధీకొండపై ఖగోళ విజ్ఞానాన్ని అందించే నక్షత్ర ప్రదర్శన శాలను ఏర్పాటు చేశారు. 1971 జూన్‌ 19న అప్పటి ఉపరాష్ట్రపతి గోపాల్‌ స్వరూప్‌ పాఠక్‌ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో తొలిగా ఏర్పాటు చేసిన నక్షత్ర ప్రదర్శన శాల ఇదే.

మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా శుక్రవారం గాంధీ పర్వతాన్ని అందరూ ఉచితంగా సందర్శించవచ్చని గాంధీ హిల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పిసికే గాంధీ తెలిపారు. ఉదయం 10 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మాత్రమే ఉచిత సందర్శనకు అనుమతి ఇస్తామని తెలిపారు.

మహాత్మాగాంధీ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1921లో విజయవాడకు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఆ క్రమంలో కొండ దిగువన నుంచి ఆయన ప్రసంగించారని చెబుతారు. విజయవాడలో జరిగిన ఆలిండియా మహాసభల్లో ఈ జిల్లావాసి పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాక నమూనాను గాంధీజీకి చూపించారు. అదే విధంగా విజయవాడతో గాంధీజీకి ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకొని 1962 నవంబర్‌లో గాంధీహిల్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం 1968 అక్టోబర్‌ ఆరో తేదీన అప్పటి రాష్ట్రపతి జాకీర్‌హుస్సేన్‌ దీనిని ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement