సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యంలో ఎంతో ముఖ్యమైన ఓటు హక్కు పరిరక్షణ కోసం ఐక్య కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియపై విజయవాడలోని దాసరి భవన్‌లో మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ, వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మి తదితరులు ప్రసంగిస్తూ... ఓట్లు తొల గించే ప్రయత్నాలను అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 44 లక్షల ఓట్లు గల్లంతైన అంశంపై ఎన్నికల కమిషన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో 42 లక్షల మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రతి ఓటరూ తన ఓటుహక్కు కోసం పదేపదే తాను అర్హుడినని నిరూపించుకోవాల్సిన దుస్థితి రావడం సరికాదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, కాంగ్రెస్ నాయకులు మస్తాన్‌వలి, కొలనుకొండ శివాజీ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవానీ, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


