దంచికొట్టిన వాన | - | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన వాన

Sep 13 2026 9:10 AM | Updated on Sep 13 2026 9:10 AM

ఎన్టీఆర్‌ జిల్లాలో

22.68 మి.మీ. వర్షపాతం

విజయవాడలో రోడ్లు జలమయం

3 గంటలపాటు ఏకధాటిగా వాన

70.4మి.మీ. వర్షపాతం నమోదు

శివారు ప్రాంతాలు నీట మునక

రోడ్లపై నీటితో స్తంభించిన ట్రాఫిక్‌

అక్కరకు రాని ఎంఆర్‌టీలు

పటమట(విజయవాడతూర్పు): విజయవాడలో వాన దంచికొట్టింది. ఏకధాటిగా మూగు గంటలపాటు కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు నీటితో నిండి వాగులను తలపించాయి. రోడ్లపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభా వంతో శనివారం విజయవాడలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈదురుగాలుతో మూడు గంటలపాటు వర్షం పడింది. 70.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి వీధుల నుంచి ప్రధాన రోడ్ల వరకు వాగులను తలపించేలా ఉప్పాంగి ప్రవహించాయి. నడుములోతు నీళ్లు రోడ్లపైకి చేరటంతో నగరవాసులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఒకవైపు రోడ్లపైకి భారీగా చేరిన వర్షపు నీరు.. మరో వైపు విరిగిపడిన చెట్ల కొమ్మలతో ఎక్కడికీ వెళ్లలేని స్థితి నెలకొంది. దీనికితోడు వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో ట్రాిఫిక్‌ నిలిచిపోవటంతో ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం పోలీసులకు కష్టంగా మారింది.

ఈ రోడ్లలో రాకపోకలంటే నరకమే..

నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఒకటైన బెంజిసర్కిల్‌ చినుకు పడితే చాలు రోడ్డన్నీ నీటమునిగి ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. ఎంజీ రోడ్డుకు రెండు వైపులా పశువుల ఆస్పత్రి వరకు నీరు చేరుతోంది. బెంజిసర్కిల్‌ నుంచి ఎన్టీయార్‌ సర్కిల్‌ వరకు, నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు, మొగల్రాజపురం, గాయత్రీ నగర్‌ లోని పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డు, ఆటోనగర్‌ గేటు నుంచి ఆటోనగర్‌ బస్‌ టెర్మినల్‌ వరకు కొద్దిపాటి వర్షానికే రోడ్లు నీటమునుగుతున్నాయి. తుమ్మల పల్లి కళాక్షేత్రం నుంచి కాళేశ్వరరావు మార్కెట్‌ లోబ్రిడ్జి వరకు, పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ నుంచి రాజీవ్‌గాంధీ పార్కు లోబ్రిడ్జి వరకు నీరు భారీగా చేరుతోంది. మరో వైపు డాబా కొట్లు సెంటర్‌ నుంచి పాయకాపురం వరకు, కండ్రిక రోడ్డులో నున్న వరకు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ఆయా రోడ్లలో పాదచారుల నుంచి భారీ వాహనాలు సైతం వర్షం పడితే రాకపోకలు సాగించలేని పరిస్థితి. కానూరు, తాడిగడప వద్ద మచిలీ పట్నం – పూణే జాతీయ రహదారి వెంబడి వర్షపు నీరు చేరటంతో వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోతాయి. చైన్నె – కోల్‌కతా జాతీయ రహదారి 16 కూడా ఇలాంటి దుస్థితే నెలకొంది. ప్రసాదంపాడు నుంచి నిడమానూరు వరకు రోడ్డుపై మొకాళ్లలోతు నీరు చేయటంతో వాహనాలు ముందుకు కదల్లేని స్థితి నెలకొంది.

విఫలమైన మాన్సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌

విజయవాడ నగరపాలక సంస్థ వర్షాలను తట్టుకునేందుకు మాన్సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేసినప్పటికీ ఫలితం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. అవసరమైన ప్రాంతాల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు, వీఎంసీ సాధారణ నిధులు, అమృత్‌ పథకం ద్వారా వచ్చిన రూ.30 కోట్లుతో ఆయా ప్రాంతాల్లో స్ట్రామ్‌ వాటర్‌ డ్రెయినేజీ నిర్మాణం, డ్రెయిన్లలో పూడికతీత, నూతన అవుట్‌ ఫాల్‌ డ్రెయిన్ల నిర్మాణం చేస్తున్నామని అధికారులు ప్రకటిస్తున్నా అవి పూర్తిస్థాయిలో అమలుకాకపోవటంతో నగరంలో కొద్దిపాటి వర్షానికే డ్రెయిన్లు పొంగిపొర్లుతున్నాయి. వన్‌టౌన్‌ జెండా చెట్టు సెంటర్‌, నిర్మలా కాన్వెంట్‌రోడ్డు, బెంజిసర్కిల్‌ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో పనులు పూర్తికాకపోవటంతో రోడ్లపైకి చేరిన వర్షం నీటితో ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది.

శివారు ప్రాంతాలకు కష్టమే

నగర శివారులోని అజిత్‌సింగ్‌నగర్‌, డాబాకొట్లు, పాయకాపురం, రాజీవ్‌నగర్‌ కండ్రిక, వాంబేకాలనీ, భవానీపురం, విద్యాధరపురం, చిట్టినగర్‌ ప్రాంతాలతోపాటు పటమట, ఆటోనగర్‌ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం పడితే చాలు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. కొండ దిగువ ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. కొండపై నుంచి వచ్చే వర్షం నీరు రోడ్లపైకి, నివాసాల్లోకి చేర టంతో ఇంటి నుంచి కాలు కూడా బయటకు పెట్టలేని దుస్థితి నెలకొంటోంది.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో శనివారం 22.68 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విజయవాడ సెంట్రల్‌ మండలంలో 72.3 మిల్లీమీటర్లు వర్షం పడింది. విజయవాడ నార్త్‌లో 69.7 మిల్లీమీటర్లు, వెస్ట్‌లో 65.0, ఈస్ట్‌లో 64.6, తిరువూరులో 37.6, ఇబ్రహీంపట్నంలో 26.4, వత్సవాయిలో 19.5, గంపలగూడెంలో 12.4, వీరులపాడులో 9.2, జి.కొండూరులో 4.0, చందర్లపాడులో 2.3, జగ్గయ్యపేటలో 1.3, నందిగామ, మైలవరంలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

విజయవాడ నగరంలో ఎప్పుడు వర్షం వచ్చిన రోడ్లపై నిలిచిన నీటిని తోడేండుకు వీఎంసీ ప్రత్యేకంగా మాన్సూన్‌ రెస్సాన్స్‌ టీం (ఎంఆర్‌టీ)ల వ్యవస్థను అమలు చేస్తోంది. నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలోని 286 సచివాలయాల ప్రాంతాల్లో అధికంగా నీరు నిలిచే 42 ప్రాంతాలను గుర్తించారు. సచివాలయ సిబ్బంది, ప్రజారోగ్యం, ఇంజినీరింగ్‌, పట్టణ ప్రణాళిక విభాగం సమన్వయంతో పనిచేసే ఎంఆర్‌టీ బృందాలు ఆయా ప్రాంతాల్లో వాహనాలను, మోటర్లు పెట్టి నీటిని తోడాల్సి ఉంది. అయితే ఈ వ్యవస్థ నిద్రావస్థలో ఉందని విమర్శలు వస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు ట్యాంకర్లు 30కు పైగా ఏర్పాటు చేశారు. వీఎంసీ సాధారణ నిధులు ఒక్కో ట్యాంకర్‌కు రోజుకు రూ.3 వేల చొప్పున ఖర్చుచేస్తున్నారు. ఇన్ని వాహనాలు ఉన్నా నగరంలో రోడ్లన్నీ జలమయం అవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement