ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ప్రాంగ ణంలో నిర్మించిన అన్నదాన భవనంలో శనివారం నుంచి భక్తులకు అన్న ప్రసాద పంపిణీ జరిగింది. ఈ భవనం వద్ద క్యూలైన్లు లేకపోవడం, ఉదయం నుంచి భారీ వర్షం పడటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొద్ది మంది మాత్రమే కూర్చుని అన్న ప్రసాదం స్వీకరించేలా దేవస్థానం ఏర్పాట్లు చేసింది. అన్నదానం ప్రారంభమైన వెంటనే లోపలకు భక్తులను అనుమతించడంతో తోపులాట జరిగింది. వారిని అదుపు చేయడం ఆలయ అధికారులు, సెక్యూరిటీ సిబ్బందికి సాధ్యపడక భవనం తలుపులు మూసేందుకు ప్రయత్నించారు. తోపు లాట సమాచారం అందడంతో ఆలయ ఈఓ శీనానాయక్, ఈఈ రమాదేవి, ఇతర ఇంజినీరింగ్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెస్ట్ ఏసీపీ దుర్గారావు, వన్‌టౌన్ సీఐ గుణ రామ్, ఇతర పోలీసులు కూడా వచ్చి నూతన భవనంలో అన్న ప్రసాదం పంపిణీ సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. అర్ధగంట తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఘాట్‌రోడ్డు మూసివేత
శనివారం వేకువ నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో ఘాట్‌రోడ్డును మూసేశారు. కొండపైకి వాహనాలను అనుమతించలేదు. దేవస్థానం బస్సులను సైతం నిలిపివేసిన ఆలయ అధికారులు భక్తులను కనకదుర్గనగర్ మీదగా మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం వైపు మళ్లించారు. ప్రసాదాల కౌంటర్, లిఫ్టు వద్ద క్యూ పెరగడటంతో పోలీసులు, ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం నుంచి ఘాట్‌రోడ్డును తెరిచారు.


