సర్వర్‌ ఏడిపింఛెన్‌ | - | Sakshi
Sakshi News home page

సర్వర్‌ ఏడిపింఛెన్‌

Sep 13 2026 9:10 AM | Updated on Sep 13 2026 9:10 AM

కొత్త పింఛన్ల దరఖాస్తులకు ఆంక్షలు విధించిన ప్రభుత్వం గంటలకొద్దీ సర్వర్‌ పనిచేయక దరఖాస్తుదారుల అవస్థలు వరుసగా మూడు రోజులుసెలవులు రావడంతో టెన్షన్‌ ఆ తరువాత అప్‌లోడ్‌ చేయటానికి రెండు రోజులే గడువు

వరుసగా మూడు రోజులు సెలవులు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): కొత్తగా సామాజిక పింఛన్ల మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపటంతో గ్రామ/వార్డు సచివాలయాలు రద్దీగా మారాయి. కూటమి ప్రభుత్వం అధి కారంలోకి వచ్చాక రెండున్నరేళ్లుగా కొత్త పింఛన్ల మాటెత్తలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక్కసారిగా కొత్త పెన్షన్లు మంజూరు అంటూ తేదీలను ప్రకటించింది. ఈ నెల ఏడు నుంచి 16వ తేదీ వరకూ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటించింది. గడువు తక్కువగా ఉండటంతో అర్హత ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు సచివాలయాల వద్ద బారులు తీరుతున్నారు. అయితే సర్వర్‌ పనిచేయక దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయడం కష్టంగా మారింది. దీంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.

లక్ష మంది ఎదురు చూపులు

ఎన్టీఆర్‌ జిల్లాలో సుమారు లక్ష మంది వరకూ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం. ప్రస్తుతం జిల్లాలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతరులు 2,29,393 మంది పింఛన్లు తీసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ వరకూ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించటంతో సచివాలయాల వద్ద రద్దీ నెలకొంది. జిల్లాలో 605 గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 286 వరకూ సచివాలయాలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు ఈ సచివాలయాలకు క్యూ కడుతున్నారు.

ఆంక్షలతో సతమతం

రెండున్నరేళ్లగా కళ్లు కాయలు కాచినట్లుగా ఎదురు చూసిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు లక్ష మంది వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోన్నారు. వారు సచివాలయానికి వెళ్లిన సమయంలో అక్కడి సిబ్బంది నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు, అడుగుతున్న పత్రాలు అర్హులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కుల ధ్రువీకరణతో పాటు ఐటీ, గ్యాస్‌ బిల్లు, ఇంటి పన్ను రశీదు తదితర పత్రాలు కావాలంటూ సిబ్బంది స్పష్టంచేస్తున్నారు. వితంతువులకు వారి భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ రేషన్‌కార్డులో అతని పేరు ఉంటే దరఖాస్తు తీసుకోవటం లేదు. ఇప్పటికిప్పుడు రేషన్‌ కార్డులో భర్త పేరు ఎలా తొలగించాలి, అవసరమైన పత్రాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని వితంతువులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల మ్యాపింగ్‌ కాలేదంటూ తిప్పి పంపుతున్నారు. రెండు మూడు రోజుల్లో కొత్త సర్టిఫికెట్లు ఎవరు మంజూరు చేస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వం ఉత్తుత్తి హడావుడే తప్పా పింఛన్లు మంజూరు చేసే ఉద్దేశం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మొరాయిస్తున్న సర్వర్‌

గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను నమోదు చేస్తున్న సమయంలో సర్వర్లు మొరాయిస్తుండటంతో అటు సిబ్బంది, ఇటు దరఖాస్తుదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ సర్వర్‌ పని చేయకపోవటంతో దరఖాస్తుదారులను సచివాలయాల్లో కూర్చోపెడుతున్నారు. దానికి తోడు రెండు సార్లు ఓటీపీ చెప్పాల్సి రావటంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తి కావటానికి గంటల సమయం వేచి చూడాల్సి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోజు మొత్తం మీద పది దరఖాస్తులు కూడా పూర్తికావటం లేదని సిబ్బంది చెబుతున్నారు. దానికి తోడు చాలా మంది పనులు మానుకొని రావటం, ‘సర్వర్‌ పని చేయటం లేదు రేపు రండి’ అంటూ సచివాలయ సిబ్బంది చెబుతుండటంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు ఇబ్బంది పడుతున్నారు.

ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ లోపు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవటానికి గడువుగా నిర్ణయించింది. రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయక చవితి పండుగ కావటంతో వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో దరఖాస్తు చేసుకునేవారిలో టెన్షన్‌ పెరిగింది. సెలవులు ముగిశాక కేవలం రెండు రోజుల గడువే ఉంటుంది. దీనికి తోడు సర్వర్‌ పనిచేయని నేపథ్యంలో దరఖాస్తులు ఎలా ఆన్‌లైన్‌ అవుతాయని అర్హులు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని ఆంక్షలు, సమస్యల నేపథ్యంలో కొత్త పింఛన్లు ఇచ్చే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement