మచిలీపట్నంఅర్బన్: వైద్య, ఆరోగ్యశాఖలో ఏళ్ల తరబడి కాంట్రాక్టు పద్ధతిలో సేవలందిస్తున్న తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి.సౌమ్యరేఖ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీ ఎంహెచ్‌సీజేఏసీ) ఆధ్వర్యంలో న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రాష్ట్రవ్యాప్త శాంతియుత పోరాటంలో భాగంగా మంగళవారం మచిలీప ట్నంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద కాంట్రాక్టు ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. నల్ల బెలూన్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సౌమ్య రేఖ మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 30 రోజుల శాంతియుత కార్యాచరణలో భాగంగా విధుల బహిష్కరణను తాత్కాలికంగా వాయిదా వేసి తొలి దశ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్య క్షుడు ఆకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సంఘీభావం తెలిపారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి.దయాకర్‌కు కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.


