కోనేరుసెంటర్(మచిలీపట్నం): భారత రత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని కృష్ణా విశ్వవిద్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న విశ్వవిద్యాలయంఉపకులపతి ఆచార్య కె.రాంజీ కేకు కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విశ్వేశ్వరయ్య అనేక రంగాల్లో విశేషంగా రాణించారని కొనియాడారు. కర్ణాటక రాష్ట్రం బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూని వర్సిటీ ఆయన పేరిట స్థాపించారని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ ఎన్.ఉష మాట్లాడుతూ.. దేశా నికే తలమానికమైన వ్యవసాయ, సాగునీటి రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలను కొనియాడారు. కృష్ణా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వై.కె.సుందరకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీడీసీ డీన్ ఆచార్య ఆర్.కిరణ్‌కుమార్, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఎం.బాబురెడ్డి, డాక్టర్ ఆర్.విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ నెల 12, 13 తేదీల్లో జరిగిన 44వ అంతర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కృష్ణాజిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ సత్తాచాటి 70 పతకాలను సొంతం చేసుకున్నారు. వివిధ క్రీడాంశాలు, పలు విభాగాల్లో 21 స్వర్ణ, 30 రజత, 19 కాంస్య పతకాలను గెలుచుకున్నారు. తమ్ము కస్తూరిబాయి, కె.గీతాంజలి, వలివర్తి నాగమణి, సోమ శేఖర్, కె.ఉమామహేశ్వరి, పి.రామకృష్ణ, పి. జ్యోతిప్రకాశ్, కోటేశ్వరరావు, ఎం.అరుణ, ఎన్. కుముదవతి, ఎస్.పురుషోత్తం స్వర్ణ పతకాలు సాధించారు. తోట యర్రన్న, ఎస్‌కే మహబూబ్ సుభానీ, టి.జమాల్ బాబు, పి.విజయ సువర్ణ రాజు, పి.మహేష్ బాబు, అప్పారి శివదుర్గా ప్రసాదరావు, వి.నాగేంద్రరావు, యు.లక్ష్మీనారాయణ, ఎల్. నెల్సన్, గోరిపర్తి వెంకట విజయకుమారి, సుంకర మాధవి, కె.జయ కృష్ణ రజత, కాంస్య పతకాలు పొందిన వారిలో ఉన్నారు. పతకాలు పొందిన మాస్టర్స్ క్రీడాకారులను కృష్ణాజిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు పి.జ్యోతి ప్రకాశ్, కార్యదర్శి ఎ. శివ గణేష్ బాబు అభినందించారు.
రేపు విశ్వకర్మ జయంతి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 17వ తేదీన విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. విశ్వకర్మ జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తోందన్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి విశ్వబ్రాహ్మణులు అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్, దనాలకోట వాసు, ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పి.సాయికిరణ్, జిల్లా అధికార ప్రతినిధి తుంపాల వరప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు కెల్లా శివ, విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం సెక్రటరీ వెంకటేశ్వరరావు, జవ్వాది కూర్మాచారి పాల్గొన్నారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన జిల్లా స్థాయి జాతీయ సైన్స్ సెమినార్ జరుగు తుందని జిల్లా సైన్స్ అధికారి కె.పిచ్చేశ్వరరావు మంగళవారం తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో ప్రతిభచాటిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికచేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 16న పాఠశాల స్థాయి, 17న మండల స్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు. మండల విద్యాశాఖ అధికారులు మండల స్థాయి పోటీలు నిర్వహించి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించాలని సూచించారు. సీవీఆర్ హై స్కూల్ ప్రాంగణంలో జిల్లా స్థాయి పోటీలు, సెమినార్ జరుగుతాని వెల్లడించారు. ‘ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2027 : ప్రాస్పెక్ట్స్ అండ్ చాలెంజెస్’ అంశంపై సెమినార్ ఉంటుందని తెలిపారు.


