పింఛన్ల దరఖాస్తుకు 16వతేదీ తుదిగడువు | - | Sakshi
Sakshi News home page

పింఛన్ల దరఖాస్తుకు 16వతేదీ తుదిగడువు

Sep 8 2026 2:11 AM | Updated on Sep 8 2026 2:11 AM

పింఛన్ల దరఖాస్తుకు 16వతేదీ తుదిగడువు సమైక్యత చాటిన సాంస్కృతిక పోటీలు 2.6 కిలోల గంజాయి స్వాధీనం

కలెక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లాలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య పెన్షన్‌, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సంప్రదాయ చెప్పుల తయారీదారులు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్‌ పింఛన్‌ కోసం అర్హులైనవారు ఈనెల 16వ తేదీలోగా అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్‌ నమోదు, ఈ–కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియను ఏడు పనిదినాల్లో పూర్తిచేయాలని కాలపరిమితిని నిర్ణయించినట్లు వివరించారు. అన్నిరకాల పింఛన్లుకు ఆధార్‌, రైస్‌కార్డు/ఆదాయ ధ్రువీకరణపత్రాలతోపాటు సంబంధిత వర్గానికి అవసరమైన ధ్రువీకరణపత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. పీజీఆర్‌ఎస్‌ ద్వారా ఇప్పటికే పింఛన్‌ కోసం అర్జీని సమర్పించిన వారు కూడా తమ పరిధిలోని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు.

ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో దక్షిణ భారత సాంస్కృతిక పోటీలు

విజయవాడ కల్చరల్‌: భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఆధ్వర్యంలో దక్షిణ మండల అంతర్‌ ప్రాంతీయ పోటీలకు విజయవాడ వేదికై ంది. రెండు రోజులపాటు సాగే ఈ పోటీలు విజయవాడలో మాకినేని బసవ పున్నయ్య విజ్ఞానకేంద్రంలో సోమవారం ప్రారంభమయ్యాయి. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ దక్షిణ మండల జోనల్‌ కార్యాలయానికి చెందిన ఉద్యోగులు ఈ పోటీలలో పాల్గొన్నారు. సోలో, గ్రూప్‌ నృత్యాలను, హిందీ, తెలుగు, చిత్రగీతాలను, లఘునాటికలను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా సౌత్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జస్మినితా లాజరస్‌ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్మినితా లాజరస్‌ మాట్లాడుతూ ప్రజలకు సేవలను అందించడంలో భారత ఆహార సంస్థ ముందుందన్నారు. శాఖకు సంబంధిన ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తున్నారంటూ అభినందించారు. పోటీల సహజమని, ప్రతీ అపజయం విజయానికి తొలి మేలికొలుపు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రీజియన్‌ జీఎం విజయకుమార్‌యాదవ్‌, ప్రాంతీయ రీజయన్‌ జీఎం సమీర్‌కుమార్‌వర్మ పాల్గొన్నారు.

గుణదల(విజయవాడతూర్పు): గంజాయిని అక్రమంగా తరలించి విక్రయిస్తున్న పలువురు నిందితులను మాచవరం పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం మేరకు..నర్సీపట్నంకు చెందిన షేక్‌ సిద్దిక్‌ (27) ఆ ప్రాంతంలో మూడు కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. విజయవాడలోని అతని స్నేహితులతో కలసి ఈ గంజాయిని అమ్మేందుకు ఇక్కడికి తరలించాడు. మాచవరం స్మశానవాటిక వద్ద గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు సిద్ధంకాగా, స్థానికుల సమాచారం మేరకు మాచవరం ఎస్‌ఐ సంధ్య వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా గంజాయి విక్రయానికి సహకరించిన గుమ్మలంపాటి నాగతేజ (21), గుమ్మలంపాటి అఖిల్‌ (22), ఉజ్జి సాగర్‌ (20), షేక్‌ దీన్‌ షాద్‌ (26), శృంగారపాటి ప్రవీణ్‌(25), మురికిపూటి మహేష్‌ కుమార్‌(26)లను అరెస్ట్‌ చేశారు. వీరు ఉపయోగించిన సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాలను సైతం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement