పక్కనే కూర్చున్నా.. ప్రాణాలు కాపాడలేకపోయా...
మృత్యుశకటమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
●గమ్యం చేరకుండానే తెల్లారిన బతుకులు
●కోదాడ మండలం దోరకుంట వద్ద
డివైడర్‌పై ఆగిన ట్రాలీలారీని
ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
●గాలిలో కలిసిన ఆరుగురి ప్రాణాలు
●మరో 15 మందికి గాయాలు
కోదాడ: ప్రమాదం జరిగిన సమయంలో తన భార్య పక్క సీట్లోనే కూర్చున్నా.. ఆమెను కాపాడుకోలేకపోయానని యాసారపు చిన్ని భర్త సుధాకర్ కోదాడ ప్రభుత్వాస్పత్రిలో రోదించిన తీరు అక్క డున్న వారిని కలచివేసింది. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న తండ్రిని పరామర్శించేందుకు చిన్నితో పాటు ఆమె భర్త సుధాకర్ రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లారు. బుధవారం రాత్రి 11 గంటలకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టికెట్ బుక్ చేసుకొని తిరిగి సొంతూరుకు బయల్దేరారు. భార్యాభర్తలిద్దరు డ్రైవర్ వెనుక రెండో సీటులో కూర్చున్నారు. చిన్ని కిటికీ వైపు, సుధాకర్ ఆమె పక్కనే కూర్చున్నారు. ప్రమాదంలో చిన్నికి ఇనుప స్తంభం బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. సుధాకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోనే ఉండమన్నా వినకుండా బయల్దేరా మని.. అప్పటి వరకు తన పక్కనే ఉన్న భార్య క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయిందని సుధాకర్ కన్నీరుమున్నీరయయ్యాడు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ/కోదాడరూరల్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మృత్యుశకటంటా మారింది. డ్రైవర్ నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలను బలి తీసుకుంది. మరో 15 మంది గాయపడటానికి కారణమైంది. తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని దుర్గాపురం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని బుధవారం తెల్లవారుజామున ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడగా, మరో 15 మంది గాయపడ్డారు. మరో రెండు గంటల్లో ఇంటికి చేరుకోవాల్సిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అంబు లెన్సుల్లో ఇంటికొచ్చిన మృతదేహాలను చూసి వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు. ఈ ప్రమాదంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన యాసారపు చిన్ని(32), పమిడిముక్కల గ్రామానికి చెందిన చెన్నకేశవుల నాగేంద్రబాబు(31), విజయవాడకు చెందిన బీటెక్ చదివిన సూరవరపు షకీనా (24), కొండూరు భావన వర్ష (23), బొల్లిపోగు మేరీజ్యోత్స్న (29), పడికిటి లక్ష్మీతేజ(30) మృతిచెందారు. భావన వర్ష సోదరుడు రెశ్వంత్ సౌదీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇంటికొస్తున్న అతనికి రాఖీ కట్టాలని భావన విజయవాడకు ప్రైవేట్ బస్సులో బయలుదేరి మృత్యువాతపడింది.
రోడ్డు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే కోదాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆరుగురి మృతదేహాలను, గాయపడిన వారిని స్థానికుల సాయంతో కోదాడ ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. తీవ్రంగా గాయపడిన కొందరిని మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలని డాక్టర్లు సూచించారు. వారు సూర్యాపేట, ఖమ్మం, విజయవాడ ఆస్పత్రుల్లో చేరారు. మృతుల కుటుంబ సభ్యు లు ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ఒక్కొక్కరుగా కోదాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకు న్నారు. మృతదేహాలను చూసి తల్లడిల్లిపోయారు. ఆరుగురి మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో కోదాడ ప్రభుత్వాస్పత్రి ఆవరణ దద్దరిల్లింది. మృతుల్లో ఐదుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉండగా.. ‘ఎన్నో ఆశలతో ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉంటున్న సమయంలో మాకు ఈ శిక్ష విధించావు ఎందుకు దేవుడా..’ అని వారి కుటుంబ సభ్యులు రోదించడం చూసి ఆస్పత్రికి వచ్చిన వారు సైతం కన్నీరు పెట్టారు. మృతురాలు భావనవర్ష తల్లి దండ్రులు కోదాడకు వచ్చేంత వరకు ఆమె మృతి చెందిన విషయాన్ని బంధువులు వారికి తెలుపలేదు. వారు మార్చురీ వద్దకు వచ్చి అక్కడ ఉన్న వాతావరణాన్ని పసిగట్టి ‘నా బిడ్డ ఎక్కడ అంటూ..’ గుండెలు పగిలేలా రోదించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మృతుల పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా సూర్యాపేట కలెక్టర్.. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అంబులెన్స్‌లను కోదాడకు పంపించి మృతదేహాలను తరలించేలా చర్యలు తీసుకున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన తర్వాత లారీలోని ఇనుప పిల్లర్లు జాతీయ రహదారిపై రెండువైపులా చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలతో పాటు విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు రోడ్డుపై భారీగా ఆగడంతో ట్రాఫిక్‌కు అంత రాయం ఏర్పడింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రోడ్డుపై పడిన ఇనుప పిల్లర్లను ఒక్కొక్కటిగా క్రేన్ సహాయంలో తొలగిస్తూ నెమ్మదిగా వాహనాలను పంపించారు. మధ్యాహ్నం 12 గంటలకు లారీని కూడా హైవే పైనుంచి పూర్తిగా పక్కకు తొలగించారు.
హైదరాబాద్ నుంచి ఇనుప పిల్లర్స్ లోడుతో విజయవాడ వెళ్తున్న ట్రాలీ లారీ కోదాడ దాటిన తర్వాత దోరకుంట సమీపంలో అదుపు తప్పింది. వేగంగా వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టి సగం డివైడర్‌పై మరో సగం రోడ్డుపై నిలిచింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదే మార్గంలో వచ్చింది. చీకట్లో రోడ్డుపై ఉన్న లారీని చూసిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై, తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బస్సును ఆ డ్రైవర్ పక్కకు ఆపి కిందికి దిగి హెచ్చరిక బోర్డులు పెట్టాలని లారీ డ్రైవర్‌కు సూచించాడు. దీనికి సాక్ష్యంగా అక్కడి పరిస్థితిని వీడియో కూడా తీసి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. బస్సు డ్రైవర్ హెచ్చరించినప్పటికీ లారీ డ్రైవర్ పట్టించుకోలేదు. రోడ్డుపై ఎలాంటి హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ బస్సు వెళ్లిన కేవలం 15 నిమిషాల తరువాత వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం బారినపడింది.


