అతి వేగంతోనే ప్రమాదాలు | - | Sakshi
Sakshi News home page

అతి వేగంతోనే ప్రమాదాలు

Aug 27 2026 3:11 AM | Updated on Aug 27 2026 3:11 AM

నిబంధనలు పాటించాలి ఇవీ సాక్షాలు..

వాహనాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. బస్సులకు స్పీడ్‌ లాక్‌ ఉండాలి. ఒకే డ్రైవర్‌ ఎక్కువ సేపు బస్సు నడపకుండా మరో డ్రైవర్‌ను నియమించాలి. వేకువ జామున డ్రైవర్లు నిద్రలోకి జారుకుని ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించినందునే పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో స్టాప్‌, రీ ఫ్రెష్‌ అండ్‌ గో కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం. వేగ నియంత్రణ, సురక్షిత డ్రైవింగ్‌ ఎంతో ముఖ్యం. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లా ప్రమాదాలు జరుగుతున్నాయి. లారీలను రోడ్డు పక్కన నిలపకుండా ట్రక్‌ బేలో మాత్రమే ఆపాలి.

– కె.దామోదర్‌,

ఏసీపీ, విజయవాడ సెంట్రల్‌

లబ్బీపేట(విజయవాడతూర్పు): అతి వేగం.. డ్రైవర్ల నిద్ర మత్తు ప్రయాణికులకు శాపంగా మారాయి. వీటి కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న యువతతో పాటు అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల్లో ప్రైవేటు ట్రావెల్స్‌వే ఎక్కువ. మానవ తప్పిదాల కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా, పోలీసు శాఖల అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించక పోవడం, అతి వేగం, డ్రైవర్లకు అధిక పని గంటలతో నిద్ర మత్తు వంటివి ప్రధాన కారణాలని వెల్లడిస్తున్నారు. తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు పోతున్నా, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిన అధికారులు పెద్దగా పట్టించు కోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు కూడా నిర్లక్ష్యం వీడి జాగ్రత్తలు తీసుకోవడంలేదు.

మితిమీరిన వేగం

‘విజయవాడ నుంచి హైదరాబాద్‌ జేఎన్‌టీయూకు నాలుగు గంటల్లో తీసుకెళ్తాం. బెంగళూరుకు ఆరు గంటల్లో వెళ్లిపోతాం’ అంటూ ట్రావెల్స్‌ నిర్వహకులు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. తక్కువ సమయంలో వెళ్లొచ్చనే ఆశతో ప్రయాణికులు సైతం అలాంటి ట్రావెల్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ బస్సులు రోడ్డు ఎక్కిన తర్వాత 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాఫిక్‌ తక్కువగా ఉండటంతో మరింత వేగంగా ఆ వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఆ వేగమే ప్రమాదాలకు కారణం అవుతోంది. ప్రయాణికులతో రాకపోకలు సాగించే బస్సులు 80 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లకూడదని నిబంధన ఉన్నా, దానిని ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డ్రైవర్లకు అదనపు పనిగంటలు

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా వేకువ జాము మూడు నుంచి నాలుగు గంటల మధ్యలోనే జరుగుతున్నాయి. సుదీర్ఘ సమయం డ్రైవింగ్‌ చేస్తుండటం వల్ల డ్రైవర్లకు తెలియకుండానే కనురెప్పలు పడిపోతుంటాయని, దీంతో బస్సులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయని రవాణా, పోలీసు శాఖల అధికారులు చెబుతున్నారు. చాలా వరకూ ప్రైవేటు బస్సును రాత్రి అంతా ఒకే డ్రైవర్‌ నడుపుతుంటాడు. ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే నిబంధన ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకే డ్రైవర్‌ సుదీర్ఘంగా బస్సు నడపడం వల్ల అలసటకు గురై నిద్ర మత్తుకు గురవుతున్నాడు. అతివేగం, నిద్ర మత్తు కారణంగా బస్సులు అదుపు తప్పి ప్రమా దాల బారిన పడుతున్నాయని రవాణా, పోలీసు శాఖల అధికారులు పేర్కొంటున్నారు.

చర్యలు ఏవీ..?

వరుసగా ట్రావెల్స్‌ బస్సులు ప్రమాదాలకు గురవుతూ ప్రజల ప్రాణాలు పోతున్నా నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. నిత్యం విజయవాడ నుంచి హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు తది తర ప్రాంతాలకు 800 వరకూ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు నడుస్తున్నాయి. ఆయా బస్సుల్లో ప్రయాణించే వారికి రక్షణ కోసం ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వేగ నియంత్రణతో పాటు, రాత్రి సమయంలో డ్రైవర్లు నిద్రమత్తులోకి జారుకోకుండా ఇద్దరు డ్రైవర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.

డ్రైవర్ల నిద్రమత్తూ కారణమే..

గాలిలో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు

ఎక్కువ ప్రమాదాలు ప్రైవేటు ట్రావెల్స్‌వే..

నిర్లక్ష్యం వీడి జాగ్రత్తలు తీసుకోని వైనం

కోదాడ ప్రమాదానికీ డ్రైవర్‌ నిద్రే కారణం!

గత ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు కర్నూలు వద్ద ఒక బైక్‌ను ఢీకొట్టింది. ఆ బైక్‌ బస్సు కింద ఇరుక్కున్న విషయాన్ని కూడా గ్రహించని డ్రైవర్‌ బస్సును వేగంగా నడపడంతో మంటలు చెలరేగి 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు కోదాడ వద్ద ఆగి ఉన్న ట్రక్‌ను ఢీకొట్టడంలో ఆరుగురు బస్సులోనే ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదానికి సైగం మితిమీరిన వేగం, డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా అధికారులు వెల్లడించారు. ఈ రెండే కాదు బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలు ఇటీవల జరుగుతున్నాయి. అదృష్ట వశాత్తూ చిన్నపాటి గాయాలతో ప్రజలు బయట పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement