చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ)కు రికగ్నేషన్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అవార్డు వచ్చిందని చైర్మన్ నెట్టెం శ్రీరఘురాం బుధవారం తెలిపారు. విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడి టోరియంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్ (ఆప్కాబ్) ఫార్మేషన్ డే వేడుకలు మంగ ళవారం రాత్రి జరిగాయి. ఈ వేడుకల్లో కేడీసీసీబీ 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్లకు పైగా వ్యాపారంతో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు కేడీసీసీబీకి ఈ అవార్డు వచ్చిందన్నారు. రాష్ట్ర సహకార కార్యదర్శి రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్ బాబు.ఎ, ఆప్కాబ్ చైర్మన్ గన్నే వీరాంజనే యులు, ఆప్కాబ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.రామకృష్ణ చేతుల మీదుగా తాను, సీఈఓ శ్యామ్‌మనోహర్ అవార్డు అందుకున్నామని తెలిపారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పోలీస్ శాఖ తరఫున పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు బుధవారం ఆషాఢ సారె సమర్పించారు. అమ్మవారికి సారెను సమర్పించేందుకు ఇంద్ర కీలాద్రికి విచ్చేసిన సీపీ రాజశేఖరబాబు దంపతులకు ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఈఓ, చైర్మన్ అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజే శారు. అమ్మవారికి సారె సమర్పించిన వారిలో డీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్ ఏసీపీ దుర్గారావుతో పాటు వన్‌టౌన్ సీఐ గుణరామ్ ఉన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యం కోసం యూపీహెచ్‌సీకి వచ్చే ప్రతి రోగికి ప్రత్యేక శ్రద్ధతో వైద్యం చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎ.శ్రావణ్‌బాబు ఆదేశించారు. ఆయన బుధవారం క్రీస్తురాజుపురం యూపీహెచ్‌సీని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేసే సిబ్బంది ఫేషియల్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ను పరిశీలించారు. అనంతరం వాక్సిన్‌ను భద్రపరిచే కోల్డ్‌చైన్ సిస్టమ్, ఫార్మసీని పరిశీలించారు. గర్భిణులు, తల్లులకు వ్యాధి నిరోధక టీకాల ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యక్రమాలను వందశాతం ఆన్‌లైన్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి విజయ వాడ బందరు రోడ్డులోని సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ కేంద్రంగా విజయవాడ – వాడపల్లి వన్ డే టూర్ ప్యాకేజీని ప్రారంభించనున్నట్లు సంస్థ జనరల్ మేనేజర్ (ట్రాన్స్‌పోర్ట్, మార్కెటింగ్) టి.ఎస్.వి.నారాయణ బుధవారం ఒక ప్రకట నలో తెలిపారు. ఎనిమిదో తేదీ వేకువ జామున నాలుగు గంటలకు సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ వద్ద బస్సు ప్రారంభమై అదే రోజు రాత్రి ఏడు గంటలకు తిరిగి చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్యాకేజీ ధర పెద్దలకు రూ.1,160, పిల్లలకు రూ.1000గా నిర్ణయించామని వివరించారు. ఈ రుసుంలో బస్సు చార్జీలతోపాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజన వసతి ఉంటాయని, ఆలయ దర్శనం టికెట్ చార్జీలను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని సూచించారు. ఆసక్తిగలవారు విజయవాడ బందరు రోడ్డులోని లెమన్ ట్రీ హోటల్ పక్కన ఉన్న సెంట్రల్ రిజర్వేషన్‌కు వచ్చి సీట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటీడీసీ.జీఓవీ.ఇన్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని సూచించారు.


