చేనేత రంగానికి చేయూతనిద్దాం | - | Sakshi
Sakshi News home page

చేనేత రంగానికి చేయూతనిద్దాం

Aug 6 2026 7:56 AM | Updated on Aug 6 2026 7:56 AM

చేనేత రంగానికి చేయూతనిద్దాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌

భవానీపురం(విజయవాడపశ్చిమ): దేశంలో వ్యవసాయం తరువాత అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న చేనేత రంగానికి చేయూతనిచ్చి పరిరక్షించుకుందామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌. మాధవ్‌ పేర్కొన్నారు. ఈ నెల ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ ఏపీ చేనేత విభాగం, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బుధ వారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన చేనేత సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత బందరు రోడ్డులోని రాఘవయ్య పార్క్‌ నుంచి ప్రదర్శనగా బయలుదేరి కళాక్షేత్రం వద్దకు చేరుకున్నారు. అనంతరం జరిగిన సభలో మాధవ్‌ మాట్లాడుతూ.. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన చేనేత వస్త్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో కష్టపడి తయారుచేసే చేనేత వస్త్రాలకు గిట్టుబాటు ధర లభించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సంద ర్భంగా ప్రతి చేనేత కుటుంబం ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

ఆప్కోలో సొసైటీలు చేరి దోచుకుంటున్నాయి

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్రా శివన్నారాయణ మాట్లాడుతూ.. చేనేత వస్త్రాలను విక్రయించే ఆప్కోలో సొసైటీలు ప్రవేశించి అందినకాడికి దోచుకుంటున్నాయని విమర్శించారు. చేనేత కళాకారుడే నేరుగా ఆప్కోలో వస్త్రాలు విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోపి శ్రీనివాస్‌ రొంగల అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బూరాడ రాధాకృష్ణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి పోతుల సునీత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్‌. దయాకర్‌రెడ్డి, నాగోతు రమేష్‌ నాయుడు, ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్‌, చేనేత సెల్‌ కన్వీనర్‌ జగ్గరపు శ్రీనివాసరావు, చిల్లపల్లి శ్రీనివాసరావు, ఏపీఎంఎస్‌ఐ డీసీ చైర్మన్‌ వీరాంజనేయ ప్రసాద్‌, వావిలాల సరళాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement