న్యూస్‌రీల్
దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం సమర్పణ
అమ్మవారి సేవలో ప్రముఖులు..
సోమవారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2026
● ధూమ్ ధామ్ జాతర
● వేడుకగా సాగిన ఊరేగింపు
● కొనసాగిన ఆషాఢ సారె సంబరాలు
● ఉదయం నుంచి సాయంత్రం
వరకు భక్తుల తాకిడి
● అన్ని దర్శన టికెట్ల విక్రయాలు రద్దు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ తరఫున హైదరాబాద్‌లోని భాగ్యనగర్ శ్రీమహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం బంగారు, వెండి బోనాలను సమర్పించింది. ఈ ఏడాది నెలకొన్న వర్షాబావ పరిస్థితులు తొలగిపోయి, వర్షాలు పుష్కలంగా కురవాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనం సమర్పించినట్లు జోగిని అవికా పేర్కొన్నారు. 17 ఏళ్లగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఉమ్మడి దేవాలయాల కమిటీ పేర్కొంది.
బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలోని రావిచెట్టు వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తి వద్ద తెలంగాణ బంగారు బోనంకు కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్‌మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 5 వందల మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ఇంద్రకీలాద్రికి వైపు సాగారు.
జోగిని అవికా బంగారు బోనంను తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా వెండి తదితర బోనాలతో మిగిలిన వారు ముందుకు సాగారు. బంగారు బోనంను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బ్రాహ్మణ వీధి, రథం సెంటర్, ఇంద్రకీలాద్రి పరిసరాలను తరలివచ్చారు. దుర్గాఘాట్‌కు చేరుకున్న ఊరేగింపు కృష్ణమ్మకు గంగ తెప్ప, పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. దుర్గాఘాట్, ఘాట్‌రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ఆలయ ప్రాంగణానికి సుమారు 700 మంది కళాకారులు, కమిటీ ప్రతినిధులు చేరుకోవడంతో ఘాట్‌రోడ్డుపై పండుగ వాతావరణం కనిపించింది. ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వద్ద బంగారు బోనంకు ఆలయ ఈవో,చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు స్వాగతం పలికారు. కమిటీ ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం బంగారు, వెండి బోనంతో పాటు పూజా సామగ్రి, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను ఆలయ ఈవో, ఆలయ అర్చకులకు అందజేశారు. అమ్మవారి దయతో ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బుల్లెట్ శ్రీధర్, మాజీ అధ్యక్షులు పేర్కొన్నారు.
ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించాయి. అమ్మవారి దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో తెల్లవారుజామున 5 గంటల నుంచి ఆలయ ప్రాంగణం రద్దీగా కనిపించింది. ఉదయం 8 గంటల కల్లా ఆలయ పరిసరాలతో పాటు మహామండపం, ఘాట్‌రోడ్డులో భక్తుల రద్దీ కనిపించడంతో దర్శనానికై విక్రయించే అన్ని టికెట్ల విక్రయాలను అధికారులు రద్దు చేశారు. బంగారు వాకిలి, రూ. 300, రూ. 100టికెట్ క్యూలైన్లలో భక్తులను ఉచితంగా దర్శనానికి అనుమతించగా, సర్వ దర్శనం రెండు లైన్ల ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఒక్క రోజే సుమారు 70వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
బేతాళ నృత్యం చేస్తున్న కళాకారుడు
విస్తరిస్తోంది.. విస్మరించొద్దు!
బెజవాడ జెన్ జీ యూత్ ఆధ్వర్యాన
ధర్నాచౌక్‌లో వినూత్న నిరసన
దుర్గమ్మను ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, తెలంగాణ స్పీకర్ జి. ప్రసాద్‌కుమార్, ఏపీ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మాజీ ఎంపీ, సినీనటుడు మురళీమోహన్, తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో, చైర్మన్లు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.


