పరీక్షలపై నిర్లక్ష్యం..
● తొలుత నమోదైన బాలికకు నెగిటివ్
● కోవిడ్ నిబంధనలు
పాటించాలంటున్న వైద్యులు
● రద్దీగా ఉండే ప్రాంతాలకు
వెళ్లేటప్పుడు మాస్క్ తప్పనిసరి
● ప్రస్తుతం అరకొరగానే
నిర్ధారణ పరీక్షలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో కోవిడ్ మళ్లీ విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ మూడు పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో ఒకరికి నెగిటివ్ వచ్చింది. ఇంకా రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. అనధికారికంగా మరింత మంది కోవిడ్ సోకి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ కావడంతో జలుబు, తీవ్రమైన బాడీపెయిన్స్, జ్వరం వంటి లక్షణాలు.. రెండు, మూడు రోజులు ఉండి తగ్గిపోతున్నాయి. దీంతో ఫ్లూ జ్వరంగా భావించి చికిత్స పొందడంతో నాలుగైదు రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. మరికొందరిలో వారం పది రోజుల పాటు నీరసం వేధిస్తోంది. అలాంటి వారికి కోవిడ్ సోకి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా మళ్లీ కోవిడ్ జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
కేసుల వివరాలు..
ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటి వరకూ ముగ్గురికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. వారిలో తిరువూరుకు చెందిన బాలికకు ఇప్పటికే నెగిటివ్ రాగా, మరో రెండు యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో ఒకరు నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరొకరు హోం ఐసోలేషన్లోనే ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కోవిడ్ విజృంభిస్తుండగా, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో సైతం కోవిడ్ కేసులు నమోదు కావడం ప్రజల్లో భయాందోళనలు ప్రారంభమయ్యాయి.
జాగ్రత్తలు తప్పనిసరి..
కోవిడ్ మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. జనం రద్దీగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండటం, చేతులను తరచూ నీటితో కడుక్కోవడం, శానిటైజర్ రాసుకోవడం, భౌతిక దూరం పాటించడం, బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరిస్తే మంచిదని సూచిస్తున్నారు. అంతేకాకుండా క్యాన్సర్, మధుమేహం, రక్తపోటు వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కోవిడ్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రభుత్వ పరంగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు అరకొరగానే చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రికి అనారోగ్యంతో వచ్చే వారికి కోవిడ్ లక్షణాలు ఉంటే అక్కడ శ్యాంపిల్ తీసి పరీక్ష చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ర్యాపిడ్ పరీక్షలు చేస్తుండగా, జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కోవిడ్ పరీక్షలు చేయడం లేదు. గతంలో పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీల్లో కూడా కోవిడ్ ర్యాపిడ్ టెస్ట్‌లు చేసే వాళ్లు. ఇప్పుడు అక్కడ చేయడం లేదు. కేవలం లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించాలని మాత్రమే నిర్ణయిస్తున్నారు. దీంతో జిల్లాలో అరకొరగానే కరోనా పరీక్షలు చేస్తున్నారని ప్రజలు అంటున్నారు.


