వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉద్యోగుల సమస్యలను కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అన్నారు. యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం ఈ సంఘ రాష్ట్ర కార్యాలయం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చల్లో ఎటువంటి హామీ రాలేదన్నారు. ప్రభుత్వం తాత్సారం చేయకుండా మంత్రుల కమిటీ ముఖ్యమంత్రితో చర్చించి పీఆర్సీ కమిషనర్‌ను తక్షణం నియమించి ప్రస్తుతం 30శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. లేకుంటే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆగస్టు నెలలో దశల వారీ ఉద్యమానికి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు ఇచ్చామని, వారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినా ఎటువంటి స్పందనలేదన్నారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్వహించబోయే ప్రత్యేక టెట్‌లో ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు సిలబస్‌లో కొంత మినహాయింపు ఇవ్వాలని, వారు బోధించే సబ్జెక్టులోని ఎగ్జామ్స్ నిర్వహించే విధంగా సిలబస్ రూపొందించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. సుందరయ్య కార్యకలాపాల రిపోర్ట్ ప్రవేశపెట్టి మాట్లాడారు. సమావేశంలో ఎం. కృష్ణయ్య, సహాధ్యక్షురాలు, పి. భవాని, జిల్లా కోశాధికారి కె. గంగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


