మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఏపీ ఈఏపీ సెట్‌లో ర్యాంకులు పొందిన స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన విజయవాడలోని రమేష్ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఆదివారం ఉదయం నుంచి ప్రారంభమైంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్–145, స్కౌట్స్ అండ్ గైడ్స్–70 మంది, సీఏపీ–470 మంది మొత్తం 685 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను ఆదివారం పరిశీలించారు. అలాగే సోమవారం ఉదయం సీఏపీ–60,001 నుంచి లక్ష లోపు ర్యాంకు, ఎన్‌సీసీ–1 నుంచి 50వేల లోపు ర్యాంకు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్–50,001 నుంచి 80 వేల లోపు ర్యాంకు, స్కౌట్స్ అండ్ గైడ్స్ 80,001 నుంచి చివరి ర్యాంకు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని హెల్ప్‌లైన్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.విజయసారథి చెప్పారు.
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మించే జానకీ సదనం(సత్రం)లో గది నిర్మాణానికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. విజయవాడకు చెందిన నరసింహారావు రూ.12లక్షల చెక్కును ఆదివారం ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం కుటుంబీకులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి దేవస్థాన అధికారులు, అర్చకులు తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యార్థులు నిర్ధేశించుకున్న లక్ష్యాలను చేరువ కావాలంటే పట్టుదల, క్రమశిక్షణతో చదవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మిశ చెప్పారు. స్థానిక సున్నపుబట్టీల సెంటర్‌లోని ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) హాలులో ‘అమ్మ’ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్(అమ్మ) అధ్యక్షుడు గారపాటి సతీష్ మాట్లాడుతూ తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు ఏటా ఈ విధంగా ఉపకార వేతనాలను అందజేస్తున్నామని, ఈ ఏడాది 423 మంది విద్యార్థులకు రూ.23లక్షల విలువైన ఉపకార వేతనాలతో పాటుగా నోటు పుస్తకాలను అందజేస్తున్నామన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుంకర చంద్రశేఖర్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): సంతానలేమితో బాధపడుతున్న దంపతుల జీవితాల్లో వెలుగులు నింపడంలో క్లినికల్ ఎంబ్రియాలజిస్టుల పాత్ర అత్యంత కీలకమైందనీ వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల రీప్రొడక్టివ్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ మోహన్ ఎస్. కామత్ అన్నారు. నైపుణ్యం, అంకితభావం కలిగిన ఎంబ్రియాలజిస్టులే ఐవీఎఫ్ కేంద్రాలకు వెన్నెముక వంటివారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంబ్రియాలజిస్టుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఎంబ్రియాలజిస్టుల దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎంజీ రోడ్డులోని ఫార్చ్యూన్ మురళీపార్క్‌లో సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ మోహన్ ఎస్. కామత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం సావనీర్ ఆవిష్కరించారు. యువ ఎంబ్రియాలజిస్టులకు క్విజ్, శాసీ్త్రయ పోస్టర్ ప్రదర్శన పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఎంబ్రియాలజిస్టుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్‌బాబు, కార్యదర్శి డాక్టర్ వి. లెనిన్ బాబు, ఉపాధ్యక్షుడు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్ పాల్గొన్నారు.


