లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ నగరంలో అపరిశుభ్రత రాజ్యమేలుతోందని, పది రోజులుగా గిరిపురం ప్రాంతంలో డయేరియా వ్యాధి విజృంభిస్తుంటే అధికారులు, పాలకులు ఏమి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఇన్‌చార్జి మల్లాది విష్ణు ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం, నగర పాలక సంస్థ పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. గిరిపురంలో డయేరియా బాధితులను ఆయన శనివారం పరామర్శించారు. వైద్య శిబిరం వద్దకు వెళ్లి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రావణ్‌బాబు ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. డయేరియా కట్టడికి చర్యలు తీసుకోవడంతో పాటు, వ్యాధి బారినపడినవారికి నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు.
కలుషిత నీరు, అధ్వాన
పారిశుద్ధ్యమే కారణం
గిరిపురం పరిసర ప్రాంతాల్లో డ్రెయిన్లు పూడిపోయి, పారిశుద్ధ్యం పూర్తిగా క్షీణించిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. పైపుల ద్వారా కలుషిత నీరు సరఫరా కావడం వల్లే డయేరియా ప్రబలిందన్నారు. ప్రజలకు సురక్షిత తాగునీరు అందించడంలో మునిసిపల్ కార్పొరేషన్ విఫలమైందని ధ్వజమెత్తారు. నగరం నడిబొడ్డున డయేరియా విజృంభించినా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రస్తుతం గిరిపురంలో 20 మందికి పైగా డయేరియా బారిన పడి ఆస్పత్రుల పాలయ్యారని, డీహైడ్రేషన్ కారణంగా కొందరిలో కిడ్నీ సమస్యలు తలెత్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే రోగులకు కనీసం స్ట్రెచ్చర్లు లేవని, మందుల కొరత వేధిస్తోందని, పైగా కొందరు సిబ్బంది లంచాలు అడుగుతున్నారని విమర్శించారు. నగరంలో పారిశుద్ధాన్ని మెరుగుపరిచి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కుక్కల అనిత, వైఎస్సార్ సీపీ నాయకులు కుక్కల రమేష్, చంటి, సమూయేలు, మనోహర్, నిరీక్షణ్, మరియరాణి, కుమారి, ఝాన్సీ, భాను, చందు, రత్న తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వీడని అధికారులు, ప్రభుత్వం
గిరిపురంలో 20 మందికి
పైగా డయేరియా
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజం
డయేరియా బాధితులకు పరామర్శ


