గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశంలోకి ఆ దేశ ఉత్పత్తులు అధికంగా వస్తాయి. మన రైతులు పండించిన పంటలకు ధరలు భారీగా తగ్గిపోతాయి. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది. రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగిపోతాయి.’ అని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. విజయవాడలో మంగళవారం రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం జరిగింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేయవద్దని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతులతో సంతకాలు చేయించి రిజిస్టర్ పోస్టు ద్వారా ఈ నెల 21లోపు రాష్ట్రపతికి పంపాలని నిర్ణయించారు. ఈ నెల 22న రాష్ట్రంలోని అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు వై.కేశవరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రైతు సంఘాల నాయకులు మల్నీడి యల్లమందరావు, మరీదు ప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘాల సమన్వయ సమితి


